Rains: ఏపీలో కుమ్మేస్తున్న వర్షాలు.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి!

Heavy Rains lashed Andhrapradesh

  • ఏపీలో భారీ వర్షాలు
  • ఏకమైన వాగులు, వంకలు
  • పొంగిపొర్లుతున్న నదులు
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • పంటలకు తీరని నష్టం
  • వర్షాల కారణంగా నలుగురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న వర్షాలు కుమ్మేశాయి. కుండపోత వాన ప్రజలను భయపెట్టింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 72 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అనంతపురం మండలంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. ద్రాక్ష, టమాటా పంటలు దెబ్బతిన్నాయి. 

గుండ్లకమ్మ రెండు గేట్లు ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఒంగోలు, కనిగిరి, పొదిలి పట్టణాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొంగువారి గూడెం ఎర్రకాలువ ప్రాజెక్టులోకి 3,723 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 2,716 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నాగావళి, వంశధార, బహుదా నదుల్లో నీటి ఉద్ధృతి పెరిగింది. వజ్రపు కొత్తూరు, పొందూరు మండలాల్లో వదరనీరు ఇళ్లలోకి చేరుకుంది. 

వర్షాలకు నలుగురి బలి
వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మృతి చెందారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో పిడుగుపాటుకు మిరపనాట్లు వేస్తున్న కూలీ మహంకాళి చంద్రశేఖర్ (42) మరణించాడు. మరొకరు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యవరంలో పొలం పనికి వెళ్లిన వి.ఆంజనేయులు (60), దర్శి మండలంలోని ఉయ్యాలవాడలో నాదెండ్ల రాణెమ్మ (35), శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురం వద్ద వరహాలుగెడ్డలో పడి పాడి శంకరరావు (27) ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News