VVS Lakshman: 2023 ప్రపంచకప్ కు జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు సవాలే: వీవీఎస్ లక్ష్మణ్
- యువ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారన్న లక్ష్మణ్
- కుర్రాళ్ల మధ్య పోటీ తీవ్రంగా ఉందని వ్యాఖ్య
- జట్టులో స్థానం సంపాదించుకోవడానికి ఇదే సరైన సమయం
వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వన్డే ప్రపంచ కప్ కు జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు పెద్ద సవాల్ గా ఉంటుందని నేషనల్ క్రికెట్ అకాడెమీ హెడ్ వీవీఎల్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ కు లక్ష్మణ్ స్టాండ్ ఇన్ కోచ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఆయన మాట్లాడుతూ... యువ క్రీడాకారులందరూ చాలా బాగా రాణిస్తున్నారని... ఆటగాళ్ల మధ్య పోటీ తీవ్రంగా ఉందని చెప్పారు.
ప్రస్తుతం ఆడుతున్న యువ క్రికెటర్లు వారికి లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారని.. అవకాశాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే మళ్లీ అవకాశం దక్కకపోవచ్చనే విషయం కుర్రాళ్లకు తెలుసని అన్నారు. ప్రధాన ఆటగాళ్లు తిరిగి వచ్చే లోపల తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి, బలమైన భారత జట్టులో స్థానం సంపాదించుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పారు.
ప్రస్తుతం టీమిండియా సీనియర్ జట్టు ఆస్ట్రేలియాకు పయనమైన సంగతి తెలిసిందే. ఇండియాలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో శిఖర్ ధావన్ నాయకత్వంలోని బీ టీమ్ ఆడుతోంది. శ్రేయస్ అయ్యర్, శుభ్ మన్ గిల్, రజత్ పటిదార్, సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్ వంటి వారు ఈ సిరీస్ లో ఆడుతున్నారు. నిన్న లక్నోలో జరిగిన తొలి వన్డేలో ఇండియా 9 పరుగుల తేడాతో ఓటమిపాలయింది.