Munugode: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఖరారు
- కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించిన కేసీఆర్
- బీజేపీ తరపున కోమటిరెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి పోటీ
- కేఏ పాల్ పార్టీ తరపున పోటీ చేస్తున్న గద్దర్
మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2003 నుంచి టీఆర్ఎస్ పార్టీలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి క్రియాశీలకంగా పని చేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పరాజయంపాలయ్యారు. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది.
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి, బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరారు. బీజేపీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి బరిలో నిలిచారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తరపున రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే బరిలోకి దిగినట్టయింది.
మరోవైపు, కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీ తరపున ప్రజా యుద్ధనౌక గద్దర్ పోటీ చేస్తుండటం తెలిసిందే. ఇంకోవైపు, అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో... మునుగోడులో ఎలక్షన్ హీట్ పెరిగింది. అన్ని పార్టీల నేతలు మునుగోడు నియోజకవర్గంలో మకాం వేశారు. గడపగడపకు వెళ్తూ ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన నేపథ్యంలో, మునుగోడులో టీఆర్ఎస్ కు ఈ గెలుపు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ లు కూడా ఇక్కడ గెలుపొంది సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాయి.