WhatsApp: వాట్సాప్ ను వినియోగించొద్దంటూ టెలిగ్రామ్ ఫౌండర్ పిలుపు
- వాట్సాప్ లో నిఘా టూల్ నడుస్తోందని ఆరోపణ
- యూజర్ల సమాచారంపై హ్యాకర్లకు పట్టు ఉన్నట్టు హెచ్చరిక
- మరే ఇతర యాప్ అయినా వాడుకోవాలని సూచన
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ డురోవ్ మరోసారి వాట్సాప్ వ్యతిరేక పల్లవి అందుకున్నారు. పోటీ సంస్థ వాట్సాప్ ను వాడొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. వాట్సాప్ అన్నది ఓ నిఘా టూల్ అని, ఈ మెస్సేజింగ్ యాప్ కు దూరంగా ఉండాలని సూచించారు. వాట్సాప్ లో గత నెల భద్రతాపరమైన లోపం వెలుగు చూడడాన్ని ఆయన ప్రస్తావించారు. యూజర్ల డేటాను వాట్సాప్ రిస్క్ లో పడేస్తోందని డురోవ్ అన్నారు.
వాట్సాప్ తప్ప మిగిలిన సాధనాల్లో ఏదో ఒకదాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. వాట్సాప్ యూజర్ల ఫోన్ లోని సమస్త సమాచారంపై హ్యాకర్లకు నియంత్రణ ఉందని డురోవ్ తన టెలిగ్రామ్ మెస్సేజ్ ద్వారా హెచ్చరించారు. వాట్సాప్ గత 13 ఏళ్లుగా యూజర్ల డేటాపై నిఘా నిర్వహిస్తోందని ఆరోపించారు. వాట్సాప్ లో భద్రతా లోపం కూడా కావాలని పెట్టిందేనన్నారు. ‘‘మీరు భూమిపై సంపన్నులా అన్నది కాదు విషయం. మీరు వాట్సాప్ వాడుతుంటే ఫోన్లోని ప్రతి యాప్ నుంచి మీ డేటాను వాట్సాప్ సేకరిస్తోంది’’అని డురోవ్ పేర్కొన్నారు.