strongest man: 548 కిలోల బరువు ఎత్తిన స్ట్రాంగెస్ట్ మ్యాన్.. వీడియో ఇదిగో
- ప్రపంచంలోనే అత్యధిక బరువు ఎత్తిన వ్యక్తిగా నిలిచిన ఉక్రెయిన్ వ్యక్తి ఒలెక్సి నొవికోవ్
- ఎనిమిది భారీ ట్రక్కు టైర్లను రాడ్ కు తగిలించి ఎత్తిన వైనం
- 2020లో ప్రపంచంలోనే అత్యంత దృఢకాయుడిగా నిలిచిన రికార్డు కూడా..
మనం ఎంత మేర బరువు ఎత్తుతాం. మహా అయితే 50 కిలోలు, కాస్త బలంగా ఉన్నవారైతే వంద, నూటయాభై కిలోల వరకు ఎత్తుతారు. మరీ ప్రొఫెషనల్స్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు వంటివారైతే 200 కిలోల వరకు ఎత్తగలరేమో. మరి అదే ఏకంగా 500 కిలోలకుపైగా బరువును ఎత్తితే.. వామ్మో అనిపిస్తుంది కదా. ఉక్రెయిన్ కు చెందిన ఒలెక్సి నొవికోవ్ అనే వ్యక్తి 500 కిలోలు ఏం ఖర్మ.. ఏకంగా 548 కిలోల బరువును పైకి లేపి.. ప్రపంచంలోనే అత్యధిక బరువు ఎత్తిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
ప్రపంచ దృఢకాయుల్లో ఒకరిగా..
ఒలెక్సి నొవికోవ్ 2020వ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత దృఢకాయుడిగా రికార్డు సృష్టించారు. ఈ ఏడాది కూడా పోటీలో పాల్గొన్న ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే యూరప్ ఖండం పరిధిలో మాత్రం అత్యంత దృఢకాయుడు ఒలెక్సియే కావడం గమనార్హం. ఆయన ఇటీవలే అత్యంత బరువు ఎత్తే ఫీట్ ను చేసి చూపారు.
అత్యంత భారీ ట్రక్కులకు వాడే ఎనిమిది టైర్లను రాడ్ కు చెరోవైపు నాలుగు చొప్పున తగిలించుకుని ఆ బరువును పైకి ఎత్తారు. వాటన్నింటి మొత్తం బరువు 548 కిలోలు. ఈ ఫీట్ కు సంబంధించిన వీడియో రెడ్డిట్ వెబ్ సైట్లో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ఆయన ఉక్రెయిన్ వ్యక్తి కావడం, అత్యంత బరువును ఎత్తడంతో.. ‘ఇందుకు కదా ఉక్రెయిన్ పై రష్యా గెలవలేకపోతోంది..’’ అని నెటిజన్లు అంటుండటం గమనార్హం.
పవర్ లిఫ్టింగ్ కాదు కాబట్టి టైర్లు ఎత్తుతారు!
సాధారణంగా బరువులు ఎత్తడానికి ఇనుప ప్లేట్లు వాడుతుంటారు. మరి ఇక్కడ టైర్లు ఎందుకు ఎత్తారు? అని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు. దీనికి ఒక నిపుణుడు వివరణ ఇచ్చారు. ‘‘జిమ్ లలో బరువులు ఎత్తడాన్ని పవర్ లిఫ్టింగ్ అంటారు. వాళ్లు వయసుల వారీగా, వారీ శరీర బరువుల వారీగా వేర్వేరు కేటగిరీల్లో బరువులు ఎత్తే పోటీలు ఉంటాయి. అదే దృఢకాయులు (స్ట్రాంగ్ మ్యాన్లు) ఉక్కు ప్లేట్లకు బదులు.. వివిధ రకాల సామగ్రిని ఎత్తుతుంటారు. ఈ క్రమంలోనే భారీ ట్రక్కు టైర్లను ఎత్తడం ఓ సంప్రదాయం..’’ అని తెలిపారు.
- ‘‘ఆ.. ఏముంది లెండి.. కేవలం కొంత ఎత్తు లేపడం పెద్ద విషయమేనా?’’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ‘‘ఓసారి ప్రయత్నించి చూడండి అది ఎంత కష్టమో తెలుస్తుంది..’’ అని మరికొందరు స్పష్టం చేస్తున్నారు.
- ఓ నెటిజన్ అయితే.. ‘‘నేను బరువులు ఎత్తడానికి ఆరు సంవత్సరాల పాటు శిక్షణ తీసుకున్నాను. ప్రాక్టీస్ చేశాను. ఇప్పటివరకు నేను గరిష్టంగా 220 కిలోలు మాత్రమే ఎత్తగలిగాను. 548 కిలోలు ఎత్తడమంటే ఎంత కష్టమో అర్థమవుతోందా?’’ అని పేర్కొన్నారు.