T20 World Cup: ఆసీస్ లో అడుగు పెట్టగానే.. టీ20 ప్రపంచ కప్ కోసం ప్రాక్టీస్ మొదలెట్టిన టీమిండియా
- నిన్న ఉదయం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణం
- పెర్త్ లోని హోటల్ కు చేరుకున్న రోహిత్‌సేన
- ప్రాక్టీస్ కోసం వెంటనే వాకా గ్రౌండ్ లోకి వచ్చిన ఆటగాళ్లు
టీ20 ప్రపంచ కప్ కోసం రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా శుక్రవారం ఆస్ట్రేలియా చేరుకుంది. గురువారం తెల్లవారుజామున జట్టు మొత్తం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఆసీస్ వెళ్లింది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని పెర్త్ లో తమకు కేటాయించిన హోటల్‌కు చేరుకుంది. ఇక, వచ్చీరాగానే టీమిండియా క్రికెటర్లంతా ప్రాక్టీస్ కు సిద్దం అయ్యారు. పెర్త్ లోని వాకా గ్రౌండ్ లో తొలి ప్రాక్టీస్ సెషన్ కు వెళ్లారు. ప్లేయర్లు గ్రౌండ్ లో ఉన్న ఫొటోను బీసీసీఐ ట్వీట్ చేసింది.
కాగా, ఈ నెల 16వ తేదీన ఆసీస్‌లో ప్రపంచ కప్ టోర్నీ మొదలవనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను 23వ తేదీన పాకి స్థాన్ తో ఆడుతుంది. అదే రోజు నుంచి ప్రధాన రౌండ్ పోటీలు ప్రారంభం అవుతాయి. అంతకంటే ముందు భారత్ నాలుగు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పోటీ పడి మెగా టోర్నీకి సిద్ధమవుతుంది. ఈనెల 10, 13వ తేదీల్లో వాకాలో వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రోహిత్‌సేన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత ప్రపంచ కప్ అధికారిక సన్నాహక మ్యాచ్ ల్లో భాగంగా ఈ నెల 17న ఆతిథ్య ఆస్ట్రేలియాతో, 19వ తేదీన న్యూజిలాండ్‌తో వామప్ మ్యాచ్‌ల్లో పోటీ పడుతుంది.