Heavy rains: తెలంగాణలో దంచి కొడుతున్న వానలు.. మరో రెండు రోజులూ పడతాయని హెచ్చరిక
- దాదాపు తెలంగాణ మొత్తం ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడి
- ఇప్పటికే పలు జిల్లాల్లో విస్తారంగా వానలు.. నీట మునిగిన కాలనీలు, రోడ్లు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలతోపాటు ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ శుక్రవారం ఉదయం నుంచీ ముసురుపట్టింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి వంటి వాటితోపాటు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా వాన పడింది.
మరో రెండు, మూడు రోజులూ వానలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కొనసాగుతోందని.. మరో రెండు, మూడు రోజుల పాటు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వానలు పడే అవకాశం ఉందని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
- కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో వానలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్ అర్బన్, హనుమకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
- రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వానలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ లో వర్షపాత అంచనాల మ్యాప్ లను పోస్ట్ చేసింది.
ఇళ్లలోకి నీళ్లు.. రోడ్లన్నీ చెరువులు
- ఆగకుండా కురుస్తున్న వానలతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి.
- ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ లో భారీ వర్షం కురిసింది. పలుకాలనీలు నీట మునిగాయి.
- హైదరాబాద్ లోని నాగోల్, మీర్ పేట ప్రాంతాల్లోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో.. మూసీ, ఈసా నదుల్లో వరద పోటెత్తింది. గండిపేట, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.