Sathya Kumar: కేంద్రం ఇస్తున్న కోట్లాది రూపాయలు ఎక్కడికి పోతున్నాయో తెలియడంలేదు: సత్యకుమార్
- ఏపీ ప్రభుత్వంపై సత్యకుమార్ విమర్శలు
- ఉత్తుత్తి మాటలతో నెట్టుకొస్తున్నారని వ్యాఖ్యలు
- కాకిలెక్కలు చెబుతున్నారని వెల్లడి
- నిధులను స్వాహా చేస్తున్నారని ఆగ్రహం
బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న కోట్లాది రూపాయలు ఎక్కడికి పోతున్నాయో అర్థంకావడంలేదని అన్నారు. రాష్ట్రంలో కనీసం పంట కాల్వలు కూడా తవ్వడంలేదని, ఈ ప్రభుత్వం డ్యాములు నిర్మిస్తుందంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.
సుంకేసుల, భైరవానితిప్ప, హంద్రీనీవా... ఇలా అనేక ప్రాజెక్టులను పట్టించుకోవడంలేదని, ఉత్తరాంధ్రలో వంశధార, మహేంద్ర తనయ, ఝంఝావతి కానీ ఒక్క ప్రాజెక్టుకు కూడా ప్రాధాన్యత ఇవ్వడంలేదని తెలిపారు. ఒక్క ప్రాజెక్టుకు కూడా పైసా నిధులు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఈ విధంగా అయితే ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారు? రైతులకు ఎలా సాగునీరు అందుతుందని నిలదీశారు.
"మీరు ఇవన్నీ చేస్తే వికేంద్రీకరణ కూడా అక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చేసి చూపించింది కదా. మేం చేయమంటోంది అదే కదా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుత్తి మాటలతో నెట్టుకొస్తోంది. పరిశ్రమలు తీసుకురాకుండా, ఉద్యోగవకాశాలు కల్పించకుండా మోసం చేస్తోంది. ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ జోన్లను ఇస్తే, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం భూములే ఇవ్వలేదు. ఒక్కో జోన్ ద్వారా 5 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
నెల్లూరులో బాల్కో, మిథానీ కలిసి రూ.4,500 కోట్లతో అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటే ఇప్పటిదాకా భూములే ఇవ్వలేదు. భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములు ఇవ్వట్లేదు. రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఐదు పైసలు కూడా విదల్చడంలేదు. రూ.18 వేల కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులు కేంద్రం మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే అవి ఆగిపోయాయి.
ప్రతి ఇంటికీ నీరు అందించే జల్ జీవన్ మిషన్ కోసం కేంద్రం రూ.7,500 కోట్లు ఇస్తే, మీరు రూ.450 కోట్లు ఇచ్చారు... మిగతాది ఎవరిస్తారు? ప్రధాని మోదీ 20 లక్షల గృహాలు ఇస్తే, ఇప్పటిదాకా ఒక్కటైనా లబ్దిదారుడికి ఇచ్చారా? ఇప్పటివరకు 10 శాతం ఇళ్లయినా నిర్మించారా? మేం మాట్లాడుతున్న అభివృద్ధి ఇది, మీరు మాట్లాడుతున్న వికేంద్రీకరణ అది.
పంచాయతీ నిధులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు దారిమళ్లించారు. జల్ జీవన్ మిషన్ నిధులు ఇవ్వడంలేదు. ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్ నిధులను కూడా స్వాహా చేశారు. ఇదీ అదీ అని లేకుండా అన్నింటిని మింగేస్తున్నారు. అభివృద్ధి అనేది వీళ్ల డిక్షనరీలోనే లేదు. సంక్షేమం అంటూ కాకిలెక్కలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు ఇస్తుంటే, వాటిని రైతు భరోసా కింద తాము ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అదొక దారుణం.
కేంద్రం రైతుల నుంచి ధాన్యాన్ని, ఇతర పంటలను కొంటుంటే, రూ.55 వేల కోట్లు తామే ఇచ్చామని చెప్పుకుంటున్నారు. దీన్ని కూడా రాష్ట్రం అకౌంట్ లోనే వేసుకుంటున్నారు. వీటన్నింటిపై కాకిలెక్కలు చూపిస్తూ వ్యవసాయానికి రూ.1.27 లక్షల కోట్లు ఇస్తున్నామని అంటున్నారు" అంటూ సత్యకుమార్ ధ్వజమెత్తారు.