Andhra Pradesh: కాణిపాకం ఆలయ ఈవోపై బదిలీ వేటు... రీజనిదే
- కాణిపాకం ఆలయ అభిషేకం టికెట్ ధరను పెంచిన సురేశ్ బాబు
- రూ.700ల నుంచి రూ.5వేలకు పెంచుతూ నోటిఫికేషన్
- విమర్శలు రావడంతో నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం
- సురేశ్ బాబు స్థానంలో ఆలయ ఈవోగా రాణా ప్రతాప్ నియామకం
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక ఆలయానికి ఇంచార్జీ ఈవోగా వ్యవహరిస్తున్న సురేశ్ బాబుపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అంతేకాకుండా ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. సురేశ్ బాబు స్థానంలో ఆలయానికి ఈవోగా రాణా ప్రతాప్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు రోజుల క్రితం కాణిపాకం ఆలయంలో అభిషేకం టికెట్ ధరను రూ.700ల నుంచి రూ.5వేలకు పెంచుతూ సురేశ్ బాబు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ టికెట్ ధర పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో సురేశ్ బాబు ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో బాధ్యతారహితంగా వ్యవహరించారంటూ సురేశ్ బాబుపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.