Belgiam: పార్లమెంట్‌లో జుట్టు కత్తిరించుకున్న బెల్జియం విదేశాంగ మంత్రి.. ఎందుకంటే?
- మరో ఇద్దరు మహిళా ప్రజా ప్రతినిధులు కూడా
- ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక పోరాటానికి మద్దతుగా చర్య
- ఇరాన్, ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఆందోళనలు
ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక పోరాటానికి సంఘీభావంగా బెల్జియం విదేశాంగ మంత్రి హడ్జా లహబీబ్, మరో ఇద్దరు మహిళా ప్రజా ప్రతినిధులు ఆ దేశ పార్లమెంటులో జుట్టు కత్తిరించుకున్నారు. బెల్జియన్ పార్లమెంట్‌లో విదేశీ వ్యవహారాలపై చర్చ సందర్భంగా, ఇరాన్‌లో నిరసనలపై అణచివేత గురించి ప్రభుత్వం స్పందించాలని న్యూ ఫ్లెమిష్ అలయన్స్ పార్టీ సభ్యులు దర్యా సఫాయ్ కోరారు. ఇరాన్‌లో జన్మించిన సఫాయ్ సంప్రదాయ దుస్తులు ధరించి ఇరాన్ నిరసనకారులు, మహిళా హక్కుల కార్యకర్తలకు మద్దతుగా తన జుట్టును కత్తిరించున్నారు. ఆమె దగ్గర నుంచి కత్తెర తీసుకొని లహబీబ్ కూడా తన జుట్టును కత్తిరించుకున్నారు. మరో రాజకీయ నాయకురాలు గోడెలే లీకెన్స్ ఈ ఇద్దరినీ అనుసరించారు. ఇరాన్ మహిళలు నిరసన తెలిపే హక్కును వినియోగించుకోవచ్చని, అయితే భద్రతా బలగాల స్పందన ఆమోదయోగ్యంగా లేదని లహబీబ్ అన్నారు.
అల్జీరియన్ తల్లిదండ్రులకు బెల్జియంలో జన్మించిన లహబీబ్ మాట్లాడుతూ... అణచివేతకు కారణమవుతున్న వారిపై కఠినమైన ఆంక్షలను విధించాలని ఈ నెలఖరులో జరిగే యూరోపియన్ బ్లాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కోరుతామని పార్లమెంటుకు తెలిపారు.
ఇస్లామిక్ దేశం అయిన ఇరాన్ లో సాంప్రదాయక దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించినందుకు 22 ఏళ్ల మహ్సా అమిని పోలీసులు నిర్బంధించారు. ఆమె కస్టడీలో మరణించడంతో ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక పోరాటం మొదలైంది. క్రమంగా ఇతర దేశాలకూ పాకింది. లండన్, ప్యారిస్, రోమ్, మాడ్రిడ్‌తో సహా అనేక ప్రధాన నగరాలకు ఆందోళన వ్యాపించింది. నిరసనకారులపై ఇరాన్ భద్రతా బలగాలు విరుచుకుపడటంతో పలువురు మరణించారు.