IAF chief: అగ్నీవీర్ లుగా యువతులకూ అవకాశం: ఐఏఎఫ్ చీఫ్
- వచ్చే ఏడాది నుంచి నియమించుకుంటామని ప్రకటన
- ఈ ఏడాది 3,000 మంది అగ్నివీర్ల నియామకం
- రానున్న సంవత్సరాల్లో మరింత మందిని తీసుకుంటామని వెల్లడి
కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలలో స్వల్పకాల ఉద్యోగ కోర్స్ ను అగ్నిపథ్ పేరుతో ఇటీవల తీసుకురాగా, ఇందులో మహిళలకూ అవకాశం లభించబోతోంది. వచ్చే ఏడాది అగ్నీవీర్ లుగా యువతులనూ తీసుకోనున్నట్టు భారత వాయుసేన (ఐఏఎఫ్) చీఫ్ వివేక్ రామ్ చౌదరి ప్రకటించారు. శనివారం ఎయిర్ ఫోర్స్ డే. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి వివేక్ రామ్ చౌదరి మాట్లాడారు.
అగ్నిపథ్ పథకం ద్వారా ఎయిర్ ఫోర్స్ లోకి పోరాట యోధులను నియమించుకోవడాన్ని సవాలుగా పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఓ సవాలుగా పేర్కొంటూ, భారత్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇదొక చక్కని అవకాశమన్నారు. ఈ ఏడాది అగ్నీవీర్ లుగా 3,000 మందిని తీసుకుంటున్నామని, రానున్న సంవత్సరాల్లో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పారు.
ఐఏఎఫ్ అధికారుల కోసం వెపన్ సిస్టమ్ బ్రాంచ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ప్రకటించారు. కొత్తగా నిర్వహణ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం స్వాతంత్య్రం తర్వాత ఇదే మొదటిసారిగా పేర్కొన్నారు. దీనివల్ల అన్ని రకాల ఆయుధ వ్యవస్థలను నిర్వహించడం తేలిక అవుతుందన్నారు. 17.5 నుంచి 21 ఏళ్ల వయసు వారు అగ్నీవీర్ ల కోసం పోటీపడొచ్చనే విషయం తెలిసిందే. మరోవైపు ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా 80 వరకు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు చండీగఢ్ లో విన్యాసాలతో అదరగొట్టనున్నాయి.