Prostate Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే ‘ప్రోస్టేట్ కేన్సర్’ ఉందేమో అనుమానించాల్సిందే

Sudden Sex Life Altering Sign Can Indicate Prostate Cancer

  • పురుషులకు ఎక్కువగా వచ్చే కేన్సర్ రకాల్లో ఇది రెండోది
  • అంగస్తంభన లోపం, మూత్ర విసర్జనలో మంట, నొప్పి దీని లక్షణాలే
  • వైద్యులను సంప్రదించి విషయం తేల్చుకోవాల్సిందే

సైలెంట్ కిల్లర్ అని కేన్సర్ కు పేరు. దీని అసలు రూపం మూడో దశలోనే బయటపడుతుంటుంది. దీంతో మహమ్మారి నుంచి పూర్తిగా బయటకు వచ్చే అవకాశాలు సన్నగిల్లిపోతాయి. తొలి దశలో గుర్తించడం ద్వారానే ప్రాణ ప్రమాదం తప్పించుకోవడానికి వీలుంటుంది. ముందుగా గుర్తించాలంటే 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికోసారి అయినా స్క్రీన్ చేయించుకోవడం మంచి మార్గం. కనీసం కొన్ని రకాల సంకేతాలు కనిపించినప్పుడు అయినా అప్రమత్తం కావాలి. 

పురుషుల్లో అత్యధికంగా నమోదవుతున్న కేన్సర్ రకాల్లో ప్రొస్టేట్ కేన్సర్ రెండోది. ఢిల్లీ, కోల్ కతా, పుణె తదితర పట్టణాల్లో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కేన్సర్ అన్నది ఏదో ఒక ప్రాంతానికి చెందినది కాదు. కనుక అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రొస్టేట్ కేన్సర్ అంటే..? ప్రొస్టేట్ గ్రంధిలో ఏర్పడేది. పురుషుల్లో వీర్యాన్ని ఉత్పత్తి చేసే గ్రంధి ఇదే. చిన్న వాల్ నట్ సైజులో ఉంటుంది. 

సామర్థ్యం తగ్గిపోవడం
అంగస్తంభన సమస్య ఉన్నట్టుండి ఏర్పడడం ప్రొస్టేట్ కేన్సర్ లో కనిపించే లక్షణాల్లో ఒకటి. అంగస్తంభన లోపం వల్ల శృంగార జీవితాన్ని ఆస్వాదించలేరు. అంగస్తంభన లోపానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. కనుక కారణాలను వైద్యుల సాయంతో గుర్తించాల్సిందే.

ఇతర లక్షణాలు
రాత్రి సమయాల్లో తరచూ మూత్ర విసర్జన చేయడం కూడా ఒక లక్షణమే. అయితే మధుమేహంలోనూ ఇది కనిపిస్తుంది. కనుక ఈ విషయంలో అయోమయానికి గురికావద్దు. మూత్ర కోశంపై నియంత్రణ కోల్పోవడం కూడా ఒకటి. అంగం స్తంభించినప్పుడు లేదా మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి లేదా మంట అనిపించడం మరో లక్షణం. మూత్రం, వీర్యంలో రక్తం కనిపించినా అలక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

ముందుగా గుర్తించడం కీలకం
ప్రొస్టేట్ కేన్సర్ వయసుతోపాటు వృద్ధి చెందుతుంది. ఎక్కువగా 50 ఏళ్లు దాటిన వారిలో కనిపిస్తుంటుంది. కుటుంబంలో ఎవరికైనా ప్రొస్టేట్ కేన్సర్ చరిత్ర ఉంటే ముందుగా అప్రమత్తమై అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అన్నది రక్త పరీక్ష. అలాగే డిజిటల్ రెక్టల్ ఎగ్జామ్ అని కూడా మరొకటి ఉంది. వీటి ద్వారా వైద్యులు ప్రొస్టేట్ కేన్సర్ ను గుర్తిస్తారు.

నివారణలు
ప్రొస్టేట్ కేన్సర్ అసలు రాకుండా చూసుకునే మార్గాల్లేవు. కాకపోతే ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామాలు సాయం చేస్తాయి. జంతు మాంసం, ప్రాసెస్డ్ మీట్ వినియోగాన్ని తగ్గించడం మంచిది.

  • Loading...

More Telugu News