inflation beating: ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఈ బ్యాంకుల్లో అధిక రేట్లు
- మూడేళ్లు, ఐదేళ్ల కాల డిపాజిట్లపై 7.50 శాతం రేటు
- సీనియర్ సిటిజన్లకు అర శాతం అధిక వడ్డీ
- రూ.5 లక్షల వరకు గ్యారంటీ
తరాలు మారినా బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్లకు ఉన్న ఆదరణ వేరు. ఎప్పుడైనా వెళ్లి తీసుకోగల వెసులుబాటు, పెట్టుబడికి భరోసా, అర్థం చేసుకునేందుకు అత్యంత సులభతర సాధనం కావడమే ఇందుకు కారణం. మరి వడ్డీ రేట్లు మారుతున్న తరుణంలో కొన్ని బ్యాంకులు మెరుగైన రేట్లను ఎఫ్ డీలపై ఆఫర్ చేస్తున్నాయి.
3 ఏళ్ల టర్మ్ డిపాజిట్లపై డీసీబీ బ్యాంకు 7.60 శాతం, బంధన్ బ్యాంకు 7.50 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 7.50 శాతం, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7.40 శాతం చొప్పున రేటును ఆఫర్ చేస్తున్నాయి. 5 ఏళ్ల టర్మ్ డిపాజిట్ పై డీసీబీ బ్యాంకు 7.50 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 7.50 శాతం, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7.40 శాతం, ఆర్ బీఎల్ బ్యాంకు 7.05 శాతం చొప్పున వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.
సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు నిండిన వారు) అయితే కొన్ని బ్యాంకులు అరశాతం అధిక రేటును ఇస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల వరకు ఉంటే పన్ను లేదు. మిగిలిన వారికి ఈ పరిమితి రూ.10 వేలుగానే ఉంది. అంతకు మించితే వ్యక్తిగత ఆదాయంలో చూపించాలి. బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ కు గ్యారంటీ ఉంటుంది. బ్యాంకు సంక్షోభంలో పడినా ఒక వ్యక్తికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు లభిస్తాయి.