YSRCP: 3 రాజధానులకు మద్దతుగా బైక్ ర్యాలీలో కిందపడ్డ వైసీపీ ఎమ్మెల్యే... గాయంతో ఆసుపత్రిలో చేరిక
- నర్సీపట్నంలో ఉమాశంకర్ గణేశ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
- ఎమ్మెల్యే బైక్ను సైడు నుంచి ఢీ కొట్టిన మరో బైక్
- గణేశ్ కాలికి తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలింపు
- ఆపరేషన్ తప్పదని చెప్పిన వైద్యులు
ఏపీలో మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నర్సీపట్నంలో స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ నేతృత్వంలో శనివారం భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాలుపంచుకున్న ఉమాశంకర్ గణేశ్ బైక్ పైనుంచి కింద పడిపోయారు. దీంతో ఆయన కాలికి తీవ్ర గాయమైంది. ఈ ఘటనతో నర్సీపట్నం వైసీపీ శ్రేణులు షాక్కు గురయ్యాయి.
ర్యాలీలో భాగంగా ఉమాశంకర్ గణేశ్ నడుపుతున్న బైక్ను మరో బైక్ ఓ సైడు నుంచి ఢీకొట్టింది. దీంతో ఉమాశంకర్ గణేశ్ అదుపు తప్పి పడపోయారు. ఈ ప్రమాదంలో గణేశ్ కాలికి గాయం కావడంతో ఆయన అనుచరులు హుటాహుటీన నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేయించుకున్న గణేశ్ మెరుగైన చికిత్స కోసం పట్టణంలోని మరో ఆసుపత్రికి వెళ్లారు. కాలికి అయిన గాయానికి ఆపరేషన్ చేస్తే తప్పించి ఫలితం ఉండదని వైద్యులు చెప్పినట్లు సమాచారం.