G Jagadish Reddy: మునుగోడులో కాంగ్రెస్ తోనే పోటీ: జగదీశ్ రెడ్డి
- కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్లారు
- కోమటిరెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయి
- కేసీఆర్ కు వస్తున్న ఆదరణను చూసే మునుగోడు ఉప ఎన్నికను తెచ్చారు
కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో వెళ్లారని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డికి 6 నెలల క్రితం రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని అన్నారు. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన వ్యక్తి... త్యాగాలు చేశానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. అమ్ముడుపోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు లేదని అన్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ కు వస్తున్న ఆదరణను చూసే మునుగోడు ఉప ఎన్నికను తెచ్చారని చెప్పారు.
బీజేపీకి ఓటు వేస్తే కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టాలు అమలవుతాయని... వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని... కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్ కు పోటీ అని అన్నారు.