USA: కారులో కూర్చుని బర్గర్ తింటుంటే.. పోలీసు వచ్చి కాల్చేశాడు. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో
- పొరపాటు పడి కాల్చి.. ఆ యువకుడే దాడికి దిగాడంటూ సమర్థించుకోబోయిన పోలీసు
- అతడి బాడీ కెమెరాలో నిక్షిప్తమైన వీడియోలో బయటపడిన వాస్తవాలు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన వీడియో
- ‘ఇది చాలా దారుణం’ అంటూ నెటిజన్ల కామెంట్లు
అది అమెరికాలోని శాన్ డియాగోలో ఉన్న ఓ మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్. ఎరిక్ కంటూ అనే 17 ఏళ్ల యువకుడు అందులోంచి బర్గర్లను తీసుకున్నాడు. పార్కింగ్ లాట్ లో ఉన్న తన కారులో కూర్చుని తింటున్నాడు. ఇంతలో జేమ్స్ బ్రెనాండ్ అనే పోలీసు అధికారి అక్కడికి వచ్చాడు. కారు డోర్ తీసి కిందికి యువకుడిని దిగాలన్నాడు. ఎందుకు అని అడిగితే రివాల్వర్ తీసి గురిపెట్టాడు. అది చూసి భయపడిన యువకుడు.. కారును పక్కకు తీయడానికి ప్రయత్నించాడు. అంతే సదరు పోలీసు రివాల్వర్ తో కాల్చడం మొదలుపెట్టాడు.
అయినా యువకుడిపైనే కేసు
కారులో కొంత దూరం పారిపోయిన యువకుడికి పలుచోట్ల బుల్లెట్ గాయాలు అయి ఆగిపోయాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. సదరు యువకుడు తనపై దాడికి ప్రయత్నించాడని జేమ్స్ బ్రెనాండ్ చెప్పడంతో.. యువకుడిపైనే కేసు పెట్టారు. తర్వాత సదరు పోలీసు డ్రెస్ కు అమర్చి ఉన్న బాడీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను ఉన్నతాధికారులు పరిశీలించగా వాస్తవాలు బయటపడ్డాయి.
- సదరు కారులో ఉన్న యువకుడు ఎలాంటి ప్రమాదకర ప్రయత్నాలు చేయలేదని గుర్తించి.. అతడిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేశారు. ఇష్టారాజ్యంగా దాడికి పాల్పడిన పోలీసుపై విచారణ చేపట్టారు.
- ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘కెండాల్ బ్రౌన్’ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘‘శాన్ ఆంటోనియా ప్రాంతంలో ఓ పోలీసు మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ ముందు పార్క్ చేసి ఉన్న కారులోని యువకుడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతడిపై కాల్పులు జరిపాడు. పైగా యువకుడే తనపై దాడికి ప్రయత్నించాడని తప్పుడు ఆరోపణలు చేశాడు” అని క్యాప్షన్ పెట్టారు.
- ఈ వీడియో, దానికి పెట్టిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు పోలీసు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ‘ఇది చాలా దారుణం’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
- ‘కొందరు పోలీసుల తీరు చూస్తుంటే.. ఎక్కడికి వెళ్లినా, ఏ సమయంలో అయినా రక్షణ లేనట్టే అనిపిస్తోంది’ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ‘కారులోని యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంటే ఏదో ఉండే ఉంటుంది. అయినా పోలీసు కాస్త చూసి వ్యవహరించాల్సింది’ అని మరికొందరు పేర్కొంటున్నారు.
- ‘అందరు పోలీసులు ఇలా ఉండరు. ఎక్కడో ఎవరో ఒకరు ఉంటారు. అలాంటి వారి వల్లే వ్యవస్థలో సమస్యలు, పోలీసులకు చెడ్డపేరు వస్తున్నాయి.’ అని కూడా కామెంట్లు వస్తున్నాయి.