Bandi Sanjay: ఒక తాంత్రికుడి సూచనలతోనే కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాడు: బండి సంజయ్
- కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శనాస్త్రాలు
- తాంత్రిక పూజ తర్వాతే కొత్త పార్టీ ప్రకటించారని వెల్లడి
- తాంత్రికుడి సూచనల మేరకే కేసీఆర్ నడుచుకుంటున్నాడని వ్యాఖ్యలు
జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీగా మార్చడం తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఒక తాంత్రికుడి సూచనల మేరకే కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాడని ఆరోపించారు.
కేసీఆర్ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజలు చేస్తున్నాడని తెలిపారు. టీఆర్ఎస్ పేరును కొనసాగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని ఆ తాంత్రికుడు చెప్పిన తర్వాత, తాంత్రిక పూజ జరిపి బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారని బండి సంజయ్ వివరించారు. తాంత్రికుడి సూచనల మేరకే కేసీఆర్ నడుచుకుంటున్నాడని తెలిపారు.
"నాకు ముందే అనుమానం వచ్చింది. ఒక జెండా లేదు, అజెండా లేదు... ఏంచేస్తాడో చెప్పలేదు... టీఆర్ఎస్ ను కాస్తా బీఆర్ఎస్ అన్నాడు... అయిపోయింది! ఈయన పెద్ద పూజారిలాగా ముహూర్తం కూడా పెట్టాడు. సార్ కరెక్ట్ గా ముహూర్తం ప్రకారం చేస్తున్నాడని ప్రజలు అనుకోవాలని ఆ విధంగా చేశాడు. ఆ ముహూర్తం కూడా తాంత్రికుడు చెప్పిన ముహూర్తమే.
దేవుడి మీద నమ్మకంలేదు, ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకంలేదు... ఆయన ఇప్పుడు దెయ్యాల పూజలు, రాక్షస పూజలు, క్షుద్రపూజలు నమ్ముతున్నాడు. సీఎం అయిన తర్వాత సచివాలయానికి వెళితే కొంప కొల్లేరవుతుందని ఇదే తాంత్రికుడు చెబితే అప్పటి నుంచి సచివాలయానికి వెళ్లడం బంద్ చేశాడు. దేశంలో సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి ఎవరంటే ఈయనే.
దుబ్బాకలో ఓడిపోతివి, హుజూరాబాద్ లో ఓడిపోతివి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలే వచ్చాయి. దాంతో మళ్లీ తాంత్రికుడ్ని అడిగితే, ఆ సచివాలయం వైబ్రేషన్స్ ఇంకా నీ మీద పడుతూనే ఉన్నాయి అని చెప్పాడు. దాంతో కేసీఆర్ సచివాలయం కూలగొట్టుడు షురూ చేశాడు" అని వివరించారు.