Alapati Rajendra Prasad: ఇవాళ ఓ వైసీపీ ఎమ్మెల్యే కూడా గుంతల రోడ్ పై కిందపడి గాయాలపాలయ్యాడు: ఆలపాటి రాజేంద్రప్రసాద్
- మంగళగిరి టీడీపీ ఆఫీసులో ఆలపాటి ప్రెస్ మీట్
- సీఎం జగన్ మాటలతో మోసగిస్తున్నాడని వెల్లడి
- ఉత్తుత్తి సమీక్షలు చేస్తున్నాడని వ్యాఖ్యలు
- రోడ్లపై వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ప్రమాదాలు తప్పడంలేదన్న ఆలపాటి
టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. మూడున్నరేళ్ల పాలనలో మూడు కిలోమీటర్లు కూడా కొత్త రోడ్లు వేయించలేని జగన్ రెడ్డి, రోడ్ల నిర్మాణం ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ఉత్తుత్తి సమీక్షలుచేస్తూ, ప్రజల్ని ఇంకా మోసగించాలనే చూస్తున్నాడని అన్నారు.
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని రోడ్లపై ప్రయాణించాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారని వెల్లడించారు. స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. నేడు వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ గుంతల రోడ్డులో బైక్ కిందపడి గాయపడ్డాడని ఆలపాటి వివరించారు. ఆఖరికి చినజీయర్ స్వామి కూడా ఏపీలోని రోడ్ల దుస్థితిపై వాపోయిన విషయాన్ని జగన్ రెడ్డి గుర్తించాలని హితవు పలికారు.
“జగన్ రెడ్డి మాటలు, సమీక్షల ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు. తాను అధికారంలోకి వచ్చినప్పటినుంచి రోడ్ల నిర్మాణంపై ఏంచేశాడో వివరిస్తూ జగన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి లీటర్ ఇంధనంపై రూపాయి సెస్ వసూలు చేస్తూ మూడున్నరేళ్లలో జగన్ రెడ్డి రూ.2,500 కోట్లు రాబట్టాడు. ఆ సొమ్ముతో రాష్ట్రంలో ఎక్కడైనా ఒక చిన్నరోడ్డు వేశాడా?
రూ.11,193 కోట్ల వ్యయంతో రోడ్లు వేస్తున్నట్లు, రూ.10,368 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు గతంలో బ్లూమీడియాలో ఆర్భాటంగా ప్రకటనలిచ్చారు. కానీ అంతిమంగా రోడ్ల నిర్మాణాన్ని ప్రకటనలకే పరిమితం చేశాడు.
రోడ్ల మరమ్మతులకు, కొత్తవి వేయడానికి కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడంలేదో జగన్ రెడ్డిచెప్పాలి. గత ప్రభుత్వంలో పనులుచేసిన కాంట్రాక్టర్లపై కక్షసాధింపులకు పాల్పడిన జగన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని వారు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది.
నాబార్డ్ కింద వచ్చిన రూ.1100 కోట్ల గ్రాంట్ కు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన వాటా(మ్యాచింగ్ గ్రాంట్) ఇవ్వలేక జగన్ రెడ్డి చేతులెత్తేశాడు. దాంతో ఆసొమ్ము కూడా వెనక్కు వెళ్లిపోయింది. రోడ్లు వేయకపోగా, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తాను చేసినట్టు ఈ ముఖ్యమంత్రి చెప్పుకోవడం సిగ్గుచేటు.
విజయవాడలో కనకదుర్గ వారధి టీడీపీ హయాంలో పూర్తయితే దాన్ని తాను పూర్తిచేసినట్లు డబ్బాలు కొట్టుకున్నాడు. చంద్రబాబు హయాంలో 2,694 కిలోమీటర్ల వరకు రోడ్లు వేశారు. జగన్ రెడ్డి తన మూడున్నరేళ్ల పాలనలో 294 కిలోమీటర్లు కూడా వేయలేదు.
గతంలో జిల్లాల్లో ఎయిర్ పోర్టులు నిర్మిస్తున్నామని చెబితే, జగన్ రెడ్డి ప్రజల్ని కూడా విమానాల్లో తిప్పుతారేమో అనుకున్నాం. రోడ్లు వేయడం చేతగాని సీఎం విమానాశ్రయాలు నిర్మిస్తాడా? రాష్ట్రంలోని రోడ్లపై నాట్లువేయడం, చేపలు పెంచడం చేస్తున్నా కూడా ముఖ్యమంత్రికి సిగ్గులేదు. రోడ్లపై నడవలేక ఎక్కడైనా ఎవరైనా సొంతంగా రోడ్లు వేసుకుందామనుకుంటే వారిని పోలీసుల సాయంతో అడ్డుకుంటున్నారు” అంటూ ఆలపాటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.