Chiranjeevi: 'గాడ్ ఫాదర్'ను అన్నయ్య ఎందుకు ఒప్పుకున్నాడా అనుకున్నాను: డైరెక్టర్ బాబీ
- 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్ లో బాబీ
- అన్ని ఎలిమెంట్స్ కుదిరాయంటూ వ్యాఖ్య
- మోహన్ రాజా టేకింగ్ చూసి కుళ్లుకున్నానంటూ వెల్లడి
- అందరూ సైనికులై పనిచేశారంటూ ప్రశంసలు
చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన 'గాడ్ ఫాదర్' ఈ నెల 5వ తేదీన విడుదలైంది. ఎన్వీ ప్రసాద్ - ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. సల్మాన్ .. నయనతార .. సత్యదేవ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, తొలి రోజునే భారీ విజయాన్ని అందుకుంది. 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరినట్టుగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు బాబీ మాట్లాడుతూ .. "ఏ సినిమా అయినా అన్ని రకాల ఎలిమెంట్స్ బాగున్నప్పుడే అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ సినిమాలో మోహన్ రాజాగారు ఇచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు బాగా నచ్చింది. అది చూసి నిజంగా నేను చాలా కుళ్లు పడిపోయాను. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు .. బీసీ సెంటర్లలో ఎలా ఆడుతుందో .. అన్నయ్య దీనిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడా అని అనుకునేవాడిని.
కానీ నిజంగా అన్నయ్యను మోహన్ రాజా చూపించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అన్నయ్యతో డ్యూయెట్స్ లేకపోయినా డిజైన్ చేసిన తీరు కూడా బాగుంది. లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ చాలా పదునుగా ఉన్నాయి. ఈ సినిమా కోసం అందరూ సైన్యంగా మారిపోయి ముందుకు నడిపించినట్టుగా నాకు అనిపించింది. ఇలాంటి ఒక సినిమా ఇచ్చినందుకు టీమ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.