Spine gourd: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. బోడకాకర
- పోషకాలు పుష్కలం
- మధుమేహులకు మంచి కాయగూర
- కాలేయ ఆరోగ్యానికి మంచి చేస్తుంది
- దీని సాగుతో రైతులకు సిరులు
బోడకాకర/ఆకాకరకాయ (స్పైన్ గోర్డ్) గురించి తెలియని వారు ఉండరు. పేరులో కాకర ఉన్నప్పటికీ చేదు లేని దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టం చూపిస్తారు. దీనికి ఉండే రుచి ప్రత్యేకత అది. కేవలం రుచిలోనే కాదు, పోషకాల్లోనూ ఈ కాయగూర మంచిదని చెప్పుకోవాలి. కొంచెం ఖరీదైన ఈ కాయగూరను తినడం ద్వారా మంచి పోషకాలను శరీరానికి అందించొచ్చు. ఇది అన్ని కాలాల్లోనూ వచ్చేది కాదు. వర్షకాలంలో కనిపిస్తుంది.
బోడకాకరలో ప్రొటీన్లు, ఫైబర్ అధికం. కేలరీలు తక్కువ. అందుకుని మధుమేహం ఉన్న వారు కూడా దీన్ని తినొచ్చు. విటమిన్ సి, అమైనో యాసిడ్స్, ఫ్లావనాయిడ్స్, క్యాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం ఇందులో తగినంత ఉంటాయని ఎన్నో అధ్యయనాలు ప్రకటించాయి.
ఆయుర్వేదంలోనూ దీనికి ప్రాధాన్యం ఉంది. కఫ, పిత్త, వాత దోషాలను బోడకాకర సమతుల్యం చేస్తుంది. మూత్ర సంబంధ సమస్యలతో బాధపడే వారికి దీన్ని సూచిస్తుంటారు. అలాగే, శ్వాస సంబంధ సమస్యలు, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే వారు కూడా దీన్ని తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.
మధుమేహం ఉన్న వారు దీన్ని తినడం వల్ల రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే పాంక్రియాటిక్ సెల్స్ ను బోడకాకరలో ఉండే ప్రాపర్టీలు నియంత్రిస్తాయి. పాంక్రియాటిక్ సెల్స్ ఇన్సులిన్ విడుదలలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిసిందే. ఇన్సులిన్ గ్లూకోజ్ ను నియంత్రిస్తుంది.
బోడ కాకర యాంటీ అలెర్జిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, నొప్పి నివారిణిగా, యాంటీ ఇన్ ఫ్లమ్మేషన్ గుణాలు కలిగి ఉంటుంది. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, అలెర్జీలపై పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో కాలేయానికి మంచి చేస్తుంది. ముఖ్యంగా ఫ్యాటీలివర్ సమస్య రాకుండా కాపాడుతుంది.
రైతులకు దండిగా ఆదాయం
బోడ కాకర ఔషధ గుణాలు కలిగి ఉండడంతో దీనికి మంచి డిమాండ్ ఉంది. దీంతో బీహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రైతులు దీని సాగుతో దండిగా ఆదాయం పొందుతున్నారు. కిలోకు రూ.100-120 వరకు లభిస్తోంది. బహిరంగ మార్కెట్లో దీన్ని రూ.200కు విక్రయిస్తుండడం గమనార్హం. ఐదు నెలల సాగుతోనే ఒక ఎకరం నుంచి రైతుకు రూ.2.5 లక్షల ఆదాయం సమకూరుతోంది.