Shardul Thakur: ప్రశ్న అడిగే ముందు తెలుసుకోండి..: రిపోర్టర్ కు శార్ధూల్ ఠాకూర్ షాకింగ్ రిప్లయ్
- బౌలర్ల నిలకడలేమిపై రిపోర్టర్ ప్రశ్న
- పిచ్ పరిస్థితులు తెలుసుకుని అడగాలని సూచన
- ధోనీ లేని లోటు తప్పకుండా ఉంటుందన్న శార్ధూల్ ఠాకూర్
రాంచిలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ నేడు జరుగుతోంది. రాంచి డైనమైట్ ఎంఎస్ ధోనీ లేని లోటు గురించి, బౌలర్ల నిలకడలేమిపై దాని ప్రభావం గురించి ఓ మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. బౌలర్ శార్దూల్ ఠాకూర్ పదునైన బదులిచ్చాడు. స్టంప్స్ వెనుక ఎంఎస్ ధోనీ మార్గదర్శనం లేకపోవడం బౌలర్ల నిలకడను దెబ్బతీస్తుందా? అని రిపోర్టర్ ప్రశ్నించాడు.
‘‘ప్రతి ఒక్కరూ ధోని లేని లోటును చూస్తున్నారు. అతడికి ఉన్న అపార అనుభవం ప్రతి ఒక్కరికీ సాయపడుతుంది. 300కు పైగా వన్డేలు, 90కు పైగా టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అనుభవం అతడిది. అతడి లాంటి అనుభవం ఉన్న మరో వ్యక్తిని పొందడం కష్టం. మా తరం అతడితో ఆడింది కనుక అతడు లేని లోటును చూస్తోంది.
ఇక బౌలర్ల నిలకడ అంటారా? భారత్ తో మ్యాచ్ లో ఇతర జట్ల ఆటగాళ్ల బౌలింగ్ లోనూ భారత క్రికెటర్లు మంచి పరుగులు రాబడుతున్నారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ లో భారత బౌలర్లను విమర్శించేట్టు అయితే, అప్పుడు వారి (దక్షిణాఫ్రికా) బౌలర్లను కూడా విమర్శించాల్సిందే. ఎందుకంటే మేము సిరీస్ గెలుచుకున్నాం. ఒక బౌలర్ నిలకడను ప్రశ్నించే ముందు, పిచ్ ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని అడగండి’’అని శార్దూల్ ఠాకూర్ బదులిచ్చాడు.