Revanth Reddy: మహిళలంటే కేసీఆర్ కు చిన్నచూపు... మునుగోడులో ఒక ఆడబిడ్డకు అవకాశం ఇవ్వండి: రేవంత్ రెడ్డి
- వచ్చే నెలలో మునుగోడు ఉప ఎన్నిక
- జోరుగా ప్రచారం
- కొయ్యలగూడెం వచ్చిన రేవంత్ రెడ్డి
- టీఆర్ఎస్, బీజేపీలను గెలిపిస్తే మార్పేమీ ఉండదని వెల్లడి
మునుగోడు ఉప ఎన్నికల బరిలో ప్రచార పర్వం జోరుగా సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు.
కాగా, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున ప్రచారం కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ... సీఎం కేసీఆర్ కు మహిళలంటే చిన్నచూపు అని, మునుగోడులో ఒక ఆడబిడ్డకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక ఆడబిడ్డకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే, సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన నిలుస్తుందని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలను గెలిపిస్తే మార్పేమీ ఉండదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని వీడి, ముగ్గురు ఉన్న పార్టీలోకి వెళ్లారని, ఏం అభివృద్ధి జరుగుతుందని పార్టీ మారారో ఆయనకే తెలియాలని అన్నారు.
ప్రజలు నమ్మి ఓట్లేసిన వారు ఇవాళ సంతలో పశువుల్లా అమ్ముడుపోయారని రేవంత్ విమర్శించారు. అలాంటి వారి వెంట మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఉండరని భావిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు.