Priest: బురఖా ధరించిన ఆలయ పూజారి... పోలీసులకు అప్పగించిన ఆటోడ్రైవర్లు
- కేరళలో ఘటన
- కోయిలాండీ పట్టణంలో బురఖా వేసుకుని తిరుగుతున్న పూజారి
- తనకు చికెన్ పాక్స్ సోకిందని వెల్లడి
- అతడి శరీరంపై చికెన్ పాక్స్ లక్షణాలు లేవన్న పోలీసులు
కేరళలో ఓ ఆలయ పూజారి బురఖా ధరించడం కలకలం రేపింది. కోయిలాండి పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఆ యువ పూజారి పేరు జిష్ణు నంబూద్రి. వయసు 28 సంవత్సరాలు. మెయ్యాపూర్ ప్రాంతంలోని ఓ ఆలయంలో జిష్ణు నంబూద్రి పూజారిగా వ్యవహరిస్తున్నాడు.
అక్టోబరు 7న కోయిలాండీ జంక్షన్ లో బురఖా ధరించి తిరుగుతున్న అతడిని ఆటో డ్రైవర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బురఖా ఎందుకు ధరించావని పోలీసులు ప్రశ్నించగా, తనకు చికెన్ పాక్స్ వ్యాధి సోకిందని, అందుకే బురఖా ధరించి తిరుగుతున్నానని ఆ పూజారి బదులిచ్చాడు.
అయితే, అతడి శరీరంపై చికెన్ పాక్స్ వ్యాధి చిహ్నాలు ఏవీ కనిపించలేదని ప్రాథమిక పరిశీలన అనంతరం పోలీసులు వెల్లడించారు. కాగా, ఆ పూజారిపై ఎలాంటి నేరారోపణలు లేవని పోలీసులు తెలిపారు. అతడి బంధువులు వచ్చి తమవాడే అని చెప్పడంతో వివరాలు నమోదు చేసుకుని విడిచిపెట్టామని పేర్కొన్నారు.