Samajwadi Party: తుది శ్వాస విడిచిన రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్
- గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో కన్నుమూత
- ఫలించని వైద్యుల ప్రయత్నాలు
- ప్రతి ఒక్కరి నేత ఇక లేరంటూ అఖిలేశ్ యాదవ్ ట్వీట్
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆగస్ట్ చివరి నుంచి గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ లో ములాయం చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో ఈ నెల 2న ఆయన్ను ఐసీయూకు తరలించి వైద్యులు చికిత్స చేస్తున్నారు. రెండు రోజుల కిందటే పరిస్థితి మరింత విషమించింది. దీంతో ప్రాణాధార ఔషధాలతో చికిత్స చేస్తున్నారు. అయినా ఉపయోగం లేకపోయింది.
‘‘నా గౌరవ తండ్రి, ప్రతి ఒక్కరి నేత ఇక లేరు’’అంటూ ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ పై చిన్న సందేశాన్ని హిందీలో పోస్ట్ చేశారు. 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ శ్వాస తీసుకోవడం కష్టంగా మారిందని, మూత్రనాళ ఇన్ఫెక్షన్ సైతం ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అఖిలేశ్ యాదవ్ తన భార్య డింపుల్ తో కలసి మేదాంత హాస్పిటల్ కు చేరుకున్నారు.