- విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్ చేసిన సీబీఐ
- అధికారికంగా ప్రకటన విడుదల
- ఇదే కేసులో లోగడ విజయ్ నాయర్ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అభిషేక్ బోయినపల్లిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ ను అరెస్ట్ చేసినట్టు సీబీఐ ప్రకటించింది. దీనికంటే ముందు ఇదే కేసులో విజయ్ నాయర్ ను సీబీఐ అరెస్ట్ చేయడం తెలిసిందే. ఇదే కేసులో సమీర్ మహేంద్ర అనే వ్యక్తిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం గమనార్హం.
ఆదివారం తమ విచారణకు హాజరుకావాలని అభిషేక్ ను సీబీఐ కోరింది. లిక్కర్ స్కామ్ లో సీబీఐ దర్యాప్తునకు సహకరించేందుకు అభిషేక్ నిరాకరించినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. దక్షిణాది నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అభిషేక్ లాబీయింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నాయి. ఢిల్లీ లిక్కర్ సామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబిన్ డిస్టిలరీస్ కు అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్ డైరెక్టర్లుగా ఉన్నారు. 2022 జూన్ 12న వీరిద్దరూ రాబిన్ డిస్టిలరీస్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో నమోదు చేశారు. ఇదే కేసులో ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటుండగా, టీఆర్ఎస్ నేతల పేర్లు కూడా వినిపించడం తెలిసిందే.