- తైవాన్ కు సంబంధించి కొంత నియంత్రణ చైనాకు వెళ్లాలన్న మస్క్
- ప్రత్యేక పాలనా ప్రాంతంగా ప్రకటించాలని సూచన
- చైనా రాయబారి సానుకూల స్పందన
- తమ ప్రజాస్వామ్య ఆకాంక్షలకు అనుగుణంగానే ఉండాలన్న తైవాన్
చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లార్చడానికి టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ చేసిన ప్రతిపాదన పట్ల చైనా సంతోషం వ్యక్తం చేయగా, తైవాన్ భిన్నంగా స్పందించింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని చైనా వాదిస్తుండడం తెలిసిందే. కానీ, తైవాన్ తమ స్వతంత్రతను కాపాడుకోవాలనే విధానంతో కొనసాగుతోంది. తైవాన్ కు అమెరికా సహా ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తుండడం చైనాకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ క్రమంలో మస్క్ కీలక సూచన చేయడం గమనించాలి.
‘‘తైవాన్ కు ప్రత్యేక పరిపాలనా జోన్ ను ఏర్పాటు చేయాలన్నది నా సూచన. ప్రతి ఒక్కరినీ ఇది సంతోష పెట్టలేకపోవచ్చు. కానీ, ఇది సహేతుకమైనది’’అని మస్క్ ప్రతిపాదన చేశారు. తైవాన్ కు సంబంధించి కొంత నియంత్రణను బీజింగ్ కు ఇవ్వడం ద్వారా ‘చైనా-తైవాన్’ విభేదాలను పరిష్కరించొచ్చని మస్క్ సూచించారు.
అమెరికాలో బీజింగ్ రాయబారి కిన్ గాంగ్ దీనిపై స్పందించారు. తైవాన్ జలసంధి అంతటా శాంతి కోసం పిలుపునిచ్చిన, తైవాన్ కు ప్రత్యేక పాలనా జోన్ ను ప్రతిపాదించిన ఎలాన్ మస్క్ కు నా ధన్యవాదాలు. శాంతియుతంగా పునరేకీకరణ కావడం, ఒకే దేశం రెండు వ్యవస్థలు అన్నది తైవాన్ సమస్య పరిష్కారానికి మా ప్రాథమిక సూత్రాల్లో భాగం. చైనా సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ది ప్రయోజనాలకు హామీ లభిస్తే, అప్పుడు తైవాన్ విలీనం అనంతరం అత్యున్నత స్థాయి స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక పాలనా ప్రాంతం సాధ్యపడతాయి. అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుంది’’అని కిన్ గాంగ్ పేర్కొన్నారు.
అమెరికాలో తైవాన్ రాయబారి స్పందిస్తూ.. ‘‘తైవాన్ ఎన్నో ఉత్పత్తులను విక్రయిస్తుంది. కానీ, మా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అమ్మకానికి లేవు. మా భవిష్యత్ కు చేసే శాశ్వత ప్రతిపాదన ఏదైనా కానీ, అది శాంతియుతంగా, బలవంతం లేకుండా, తైవాన్ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి’’అని పేర్కొన్నారు.