Roja: అమరావతిని అభివృద్ధి చేస్తే రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుందా?: రోజా
- తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రోజా
- రాజధాని అంశంపై స్పందన
- పవన్ కల్యాణ్ ది కుంభకర్ణుడి నిద్ర అని విమర్శలు
- మూడు రాజధానులతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ
విశాఖ గర్జన సభపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ మంత్రులు మండిపడుతున్నారు. క్రీడలు, టూరిజం శాఖ మంత్రి రోజా స్పందిస్తూ, పవన్ కల్యాణ్ ది కుంభకర్ణుడి నిద్ర అని అభివర్ణించారు. టీడీపీ, బీజేపీతో జత కట్టినప్పుడు ఉత్తరాంధ్రలో వలసలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. రోజుకో మాట, పూటకో వేషం వేసుకుంటే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం రోజా మాట్లాడుతూ, మూడు రాజధానులతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చేయడం వల్ల ఎంత ఇబ్బందిపడ్డామో, భవిష్యత్ తరాల వారు అలాంటి ఇబ్బందిపడకూడదనే మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని వివరించారు.
జగన్ మోహన్ రెడ్డి ఒక తండ్రి మనసుతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే, టీడీపీ వాళ్లు నానా యాగీ చేస్తున్నారని రోజా విమర్శించారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా తొడలు కొడుతూ, మీసాలు దువ్వుతూ వైజాగ్ వైపు పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు.
29 గ్రామాల కోసం 26 జిల్లాను ఫణంగా పెట్టలేమని స్పష్టం చేశారు. రైతులు అమరావతిలోనే కాదని, రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ ఉన్నారని తెలిపారు. అది అమరావతి ఉద్యమం కాదని, అత్యాశాపరుల ఉద్యమం అని రోజా విమర్శించారు.
అమరావతిని అభివృద్ధిని చేస్తే రాష్ట్రమంతా అభివృద్ధి చెందదన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలని, అనవసర రాద్ధాంతం మాని ఇప్పటికైనా 26 జిల్లాల అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.