Henly Global: ఈ దేశాల పాస్ పోర్టులు చాలా పవర్ ఫుల్... ర్యాంకులు ప్రకటించిన హెన్లీ గ్లోబల్ సంస్థ
- ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలతో ర్యాంకుల జాబితా
- మొత్తం 112 ర్యాంకులు కేటాయింపు
- 60 దేశాల్లో ప్రత్యేక యాక్సెస్ తో 87వ స్థానంలో ఇండియా
- 193 దేశాల్లో యాక్సెస్ తో టాప్ లో జపాన్
- తర్వాతి స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియా
- అట్టడుగున నిలిచిన ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, శ్రీలంక
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 212 దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో పరిస్థితులు, రాజకీయాలు, భద్రత వంటి వాటి ఆధారంగా ఆయా దేశాలకు ఇతర దేశాలు ఇచ్చే ప్రాధాన్యత ఆధారపడి ఉంటుంది. ఇది పాస్ పోర్టుల విలువపైనా ప్రభావం చూపుతుంది. దీనివల్ల కొన్ని చిన్న దేశాల పాస్ పోర్టులకు కూడా విలువ ఎక్కువగా ఉంటుంది. దానితో వివిధ దేశాలకు సులువుగా వీసా దొరుకుతుంది. ఇతర ప్రత్యేక గుర్తింపూ ఉంటుంది. ఈ క్రమంలో, 112 ర్యాంకులతో హెన్లీ గ్లోబల్ సంస్థ ‘వరల్డ్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ ఇండెక్స్’ను విడుదల చేసింది.
దేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఆధారంగా..
తమతో సత్సంబంధాలు కలిగి ఉండే కొన్ని దేశాల పాస్ పోర్టులకు ఇతర దేశాలు ప్రత్యేక గుర్తింపు ఇస్తుంటాయి. వీసాలు, ఇతర అంశాలు అదనపు వెసులుబాట్లు ఇస్తుంటాయి. అలాంటి ప్రత్యేక గుర్తింపును ఎన్ని దేశాలు ఇచ్చాయనే డేటా ఆధారంగా.. వివిధ దేశాల పాస్ పోర్టులకు హెన్లీ గ్లోబల్ సంస్థ ర్యాంకులు ఇచ్చింది. ఇందుకోసం ‘ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (ఐఏటీఏ)’ నుంచి తీసుకున్న డేటా ఆధారంగా చేసుకుంది.
- మొత్తంగా 199 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా.. ఇండియా పాస్‌పోర్టు 60 దేశాల్లో యాక్సెస్‌తో 87వ స్థానంలో నిలిచింది.
- ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్టుగా జపాన్ పాస్ పోర్ట్ నిలిచింది. ఆ పాస్ పోర్టుకు ఏకంగా 193 దేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని హెన్లీ సంస్థ పేర్కొంది. ఇక సింగపూర్, దక్షిణ కొరియా (192 దేశాల్లో యాక్సెస్) రెండో స్థానంలో... జర్మనీ, స్పెయిన్ (190) మూడో స్థానంలో ఉమ్మడిగా నిలిచాయి.
- నాలుగో స్థానంలో ఫిన్లాండ్, ఇటలీ, లగ్జెంబర్గ్ (189), 5వ స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడన్ (188), 6వ స్థానంలో ఫ్రాన్స్, యూకే, ఐర్లాండ్, పోర్చుగల్ (187), ఏడో స్థానంలో అమెరికా, బెల్జియం, నార్వే, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ (186) నిలిచాయి.
- 8వ స్థానంలో ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా (185), 9వ స్థానంలో హంగేరీ (183), 10వ స్థానంలో లిథువేనియా, స్లొవేకియా, పోలాండ్ (182) ఉన్నాయి.
- ఇక అతి తక్కువ దేశాల్లో యాక్సెస్ తో ఆఫ్ఘనిస్థాన్ (27) అట్టడుగున 112వ స్థానంలో నిలిచింది. దానికిపైన ఇరాక్ (29), సిరియా (30), పాకిస్థాన్ (32), యెమన్ (34), సోమాలియా (35), పాలస్తీనా, నేపాల్ (38), ఉత్తర కొరియా (40), బంగ్లాదేశ్, కొసావో, లిబియా (41), కాంగో, లెబనాన్, సూడాన్, శ్రీలంక (42) దేశాలు నిలిచాయి.
- భారతదేశానికి చుట్టూ ఉన్న చాలా వరకు దేశాలు అట్టడుగు స్థానంలో ఉండటం గమనార్హం.