AP CID: సీఐడీ కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో చింతకాయల విజయ్ పిటిషన్
- ఇటీవలే హైదరాబాద్‌లోని విజయ్ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు
- విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ
- నోటీసులకు లిఖితపూర్వక వివరణ ఇచ్చిన విజయ్
- విజయ్ లంచ్ మోషన్ పిటిషన్‌పై రేపు విచారణ!
ఏపీ సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సోమవారం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... దీనిపై రేపు (మంగళవారం) విచారణ చేపట్టే అవకాశాలున్నట్లు సమాచారం.
ఇటీవలే ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని విజయ్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విజయ్ దంపతులు ఇంటిలో లేకపోవడంతో ఆయన కారు డ్రైవర్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు తన ఇంటిలో రభస సృష్టించారని విజయ్ ఆరోపించారు. తమ ముందు విచారణకు రావాలన్న సీఐడీ నోటీసులకు ఆయన రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. తాజాగా, కేసును కొట్టేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.