Nasa: అంతరిక్షంలో అద్భుతమైన గ్యాస్ బెలూన్ 'బబుల్ నెబ్యులా'... ఫొటో, వివరాలు విడుదల చేసిన నాసా
- 7,100 కాంతి సంవత్సరాల దూరంలో 'బబుల్ నెబ్యులా'
- ఇన్ స్టాగ్రామ్ లో ఫొటో, వివరాలతో నాసా పోస్టు
- ఒక్కరోజులోనే 15 లక్షలకు పైగా లైకులు
- మనకు తెలియనిది ఎంతో ఉందంటూ నెటిజన్ల కామెంట్లు
మన విశ్వం ఎన్నో విచిత్రాలు, వింతలకు నిలయం. అందులో మనకు తెలియని, మనం ఊహించలేని ఎన్నో ఉన్నాయి. నాసా తమ పరిశోధనల్లో వాటిని గుర్తిస్తూ మనకు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక అద్భుతమైన ‘బబుల్ నెబ్యులా’ చిత్రాన్ని విడుదల చేసింది. భూమికి 7,100 కాంతి సంవత్సరాల దూరంలో కాస్సియోపియా నక్షత్ర మండలంలో ఈ చిత్రమైన నెబ్యులా ఉన్నట్టు ప్రకటించింది.
ఏమిటీ నెబ్యులాలు?
అంతరిక్షంలో భారీ ఎత్తున వాయువులు (గ్యాస్), అంతరిక్ష పదార్థాలతో కూడిన ప్రదేశమే నెబ్యులాగా చెప్పవచ్చు. భారీ నక్షత్రాల నుంచి వెలువడే పదార్థాలతో గానీ , నక్షత్రాలు పేలిపోయినప్పుడు గానీ నెబ్యులాలు ఏర్పడుతాయి. ఈ నెబ్యులాల్లోని పదార్థాలు గురుత్వాకర్షణతో మళ్లీ ఒక్క దగ్గరికి చేరి నక్షత్రాలు, గ్రహాలుగా కూడా ఏర్పడుతుంటాయి.
అత్యంత భారీగా..
నీలి రంగులో ప్రకాశవంతంగా మెరిసిపోతున్న బబుల్ నెబ్యులా.. మన సూర్యుడికన్నా 45 రేట్లు పెద్దగా ఉన్న ఓ నక్షత్రం చుట్టూ ఆవరించి ఉన్నట్టు నాసా తెలిపింది. ఆ నక్షత్రంలో జరిగే ఉష్ణ, రసాయనిక చర్యలతో పదార్థం బయటికి వెలువడి నెబ్యులాగా విస్తరించిందని పేర్కొంది. ఇది ఏకంగా ఏడు కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో ఉందని వివరించింది.
- ఒక కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక ఏడాదిలో ఎంత దూరం ప్రయాణిస్తుందో అంత దూరం అన్నమాట. కాంతి సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే ఏడాదిలో ఎంత దూరమో ఊహించుకోవడమే కష్టం. ఆ దూరాన్ని లెక్కల్లో చెప్పలేకనే.. కాంతి సంవత్సరాల్లో చెబుతుంటారు.
- ఇన్ స్టాగ్రామ్ లో నాసా పెట్టిన ఫొటోకు కేవలం ఒక్కరోజులోనే ఏకంగా 15 లక్షలకుపైగా లైకులు రావడం గమనార్హం. ఇది అద్భుతంగా ఉందంటూ వేల మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
- ‘‘మన విశ్వం ఎంతో అందమైనది. అనంతమైనది. ఇప్పటికీ మనకు తెలియనిది ఎంతో ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది..” అని కొందరు కామెంట్లలో పేర్కొన్నారు.