Hyderabad: తెలంగాణలో మరో యానిమల్ వాక్సిన్ యూనిట్... రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐఐఎల్
- ఇప్పటికే గచ్చిబౌలిలో ఐఐఎల్‌కు ఓ వాక్సిన్ తయారీ యూనిట్
- కొత్తగా జీనోమ్ వ్యాలీలో మరో యూనిట్
- ఈ యూనిట్‌తో 750 మందికి ఉపాధి
- ఐఐఎల్ ప్రతిపాదనను ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
పెట్టుబడుల ఆకర్షణలో దూసుకుపోతున్న తెలంగాణ... సోమవారం మరో భారీ పెట్టుబడిని సాధించింది. హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో యానిమల్ వాక్సిన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) ముందుకు వచ్చింది. ఈ యూనిట్ కోసం ఐఐఎల్ ఏకంగా రూ.700 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ వచ్చిన ఐఐఎల్ ఎండీ ఆనంద్ కుమార్ తన ప్రతినిధి బృందంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు హైదరాబాద్‌లో తమ నూతన పెట్టుబడి ప్రతిపాదనలను కేటీఆర్‌కు వెల్లడించారు.
ఇప్పటికే గచ్చిబౌలిలో ఐఐఎల్‌కు ఓ యానిమల్ వాక్సిన్ ప్లాంట్ ఉంది. ఇందులో ఏడాదికి 300 మిలియన్ వాక్సిన్ డోసులను ఆ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. కొత్తగా జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న తన తదుపరి యూనిట్లో ఏడాదికి మరో 300 మిలియన్ యూనిట్ల వాక్సిన్లను ఉత్పత్తి చేయనుంది. రూ.700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో 750 మందికి పైగా ఉపాధి లభించనుందని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే వాక్సిన్ కేపిటల్ ఆఫ్ వరల్డ్‌గా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో ఐఐఎల్ మరో వాక్సిన్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుండడం హర్షణీయమని ఆయన తెలిపారు.