Swiss Banks: నాలుగో విడత స్విస్ బ్యాంకు ఖాతాల వివరాలు అందుకున్న భారత్
- ప్రపంచ దేశాల ప్రముఖులకు స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు
- వివిధ దేశాలతో స్విస్ ప్రభుత్వానికి ఒప్పందం
- పరస్పరం సమాచార మార్పిడి
- ఇప్పటివరకు మూడు విడతల్లో బ్యాంకు ఖాతాల వివరాలు అందజేత
ప్రముఖులు, ఉన్నతాదాయ, సంపన్న వర్గాలకు చెందిన వారు స్విస్ బ్యాంకుల్లో నగదు జమ చేయడం తెలిసిందే. అనేక దేశాల వారికి స్విస్ బ్యాంకులు అత్యంత భద్రమైనవిగా కనిపిస్తుంటాయి. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకుంటారన్న ప్రచారం కూడా ఉంది.
ఇక అసలు విషయానికొస్తే, స్విస్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన నాలుగో విడత సమాచారాన్ని స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్ కు అందించింది. ఇప్పటివరకు మూడు విడతల్లో భారత్ కు వివిధ ఖాతాలపై స్విస్ ప్రభుత్వం వివరాలు తెలిపింది.
పరస్పర సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా ఏటా ఈ మేరకు స్విస్ ప్రభుత్వం బ్యాంకు ఖాతాల వివరాలను భారత్ తో పంచుకుంటోంది. వివిధ ఒప్పందాల మేరకు, మొత్తం 101 దేశాలకు చెందిన 34 లక్షల మంది ఆర్థిక ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ సర్కారు ఆయా దేశాలతో పంచుకుంటుంది.
తాజా విడతలో భారత్ కు అందజేసిన సమాచారంలో వివిధ వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు, ట్రస్టులకు సంబంధించిన వందలాది అకౌంట్ల వివరాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సమాచార మార్పిడి ఒప్పందంలోని నిబంధన మేరకు ఆ ఖాతాలు ఎవరివన్న విషయం వెల్లడించలేమని అధికారులు పేర్కొన్నారు. అయితే, ఎవరైనా పన్ను ఎగవేతకు పాల్పడడం, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడి విచారణ ఎదుర్కొంటుంటే, అలాంటి కేసుల్లో దర్యాప్తు కోసం ఈ ఖాతాల వివరాలను ఉపయోగించుకోవచ్చని వివరించారు.