WhatsApp: వాట్సాప్ లో ఇక మీదట పెద్ద గ్రూపులు
- ఒక్కో గ్రూపులో ప్రస్తుతం 512 మందికే అనుమతి
- త్వరలో 1024 మందికి అనుమతించనున్న వాట్సాప్
- పరీక్షల దశలో ఈ ఫీచర్
వాట్సాప్ లో గ్రూపులు పెద్దవి కానున్నాయి. మరింత మంది సభ్యులు ఒక గ్రూపులో ఉండేందుకు వాట్సాప్ అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం ఒక గ్రూపులో 512 మంది వరకు ఉండొచ్చు. అంతకు మించితే మరో గ్రూపు నిర్వహించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. త్వరలోనే ఒక గ్రూపులో 1024 మందిని వాట్సాప్ అనుమతించనుంది. ఈ విషయాన్ని వాట్సాప్ కు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే వాబీటాఇన్ఫో వెల్లడించింది. మొదట్లో వాట్సాప్ గ్రూపులో సభ్యుల పరిమితి 256గా ఉండేదని తెలిసిందే. తర్వాత దాన్ని 512కు పెంచింది. ఇప్పుడు మరోసారి పెంచనుంది.
ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో బీటా వెర్షన్ గా ప్రస్తుతం ఇది అమల్లో ఉంది. భారత్ లో వాట్సాప్ కు యూజర్లు ఎక్కువ. ఇప్పటికీ గ్రూపు సభ్యుల పరిమితి విషయంలో టెలిగ్రామ్ అగ్రగామిగా ఉంది. ఒక గ్రూపులో 2 లక్షల మంది వరకు చేరి, చాట్ చేసుకునే సదుపాయం టెలిగ్రామ్ లో ఉంది. వాట్సాప్ త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లను కూడా పరిచయం చేయనుంది. చాట్స్ ను స్క్రీన్ షాట్స్ తీసుకోకుండా నిరోధించే ఆప్షన్ ను అభివృద్ధి చేస్తోంది. వ్యూ వన్స్ అనే ఆప్షన్ కింద చాట్ చేస్తే వాటిని స్వీకరించినవారు స్క్రీన్ షాట్ తీసుకోలేరు. ఈ సదుపాయం ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది.