Pawan Kalyan: 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర'గా ప్రకటించండి: పవన్ కల్యాణ్
- మూడు రాజధానులకే ఎందుకు పరిమితమయ్యారన్న పవన్
- 25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా ప్రకటించాలని ఎద్దేవా
- ప్రజల మనోభావాలను వైసీపీ ప్రభుత్వం లెక్క చేయడం లేదని మండిపాటు
మూడు రాజధానుల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాజధాని వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి జరుగుతుందని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంటే... కేవలం మూడు రాజధానులకే ఎందుకు పరిమితమయ్యారని ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టం, న్యాయ వ్యవస్థ కంటే తామే గొప్ప అని వైసీపీ భావిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను కేర్ చేయడం లేదని అన్నారు.
ఏపీని 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర'గా ప్రకటించాలని... 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి, 25 రాజధానులను ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లాలోని రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ 'మౌంట్ దిల్ మాంగే మోర్' ధన-వర్గ-కులస్వామ్యానికి చిహ్నమని.. బూతులకు కూడా అని ట్వీట్ చేశారు. ఇదే సమయంలో అమెరికాలోని సౌత్ డకోటాలో ఉన్న మౌంట్ రష్ మోర్ ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ-విశ్వాసాలకు ఇది నిదర్శనమని చెప్పారు.