Vijayasai Reddy: రామోజీరావును 'రామూ' అని సంబోధిస్తూ విజయసాయి తీవ్ర విమర్శలు
- విశాఖలో నాకు ఒక్క ఇల్లు మాత్రమే ఉందన్న విజయసాయి
- తన కూతురు కుటుంబం భూములు కొంటే తనకేం సంబంధమని ప్రశ్న
- రామోజీరావు మాదిరి మోసం చేసి భూములు పోగేసుకోలేదని వ్యాఖ్య
ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో భూములు కొనుగోలు చేశానంటూ తనపై ఈనాడులో తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో తనకు కేవలం ఒక్క ఇల్లు మాత్రమే ఉందని చెప్పారు. తన కుమార్తె కుటుంబం నాలుగు దశాబ్దాలుగా వ్యాపారంలో ఉందని... వాళ్లు భూములు కొనుగోలు చేస్తే తనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి భూములు కొనుగోలు చేస్తే బాలకృష్ణకు ఏం సంబంధం ఉంటుందని అన్నారు. రామోజీరావు మాదిరి మోసం చేసి భూములను పోగేసుకోలేదని చెప్పారు. రామోజీ ఫిలిం సిటీలోనే 2,500 ఎకరాల భూమి ఉందని చెప్పారు. పక్కవాళ్లు చేస్తే వ్యభిచారం... తాను చేస్తే సంసారమని రామూ అనుకుంటారని వ్యాఖ్యానించారు.
సీబీఐ విచారణకు తాను సిద్ధమని... రామోజీరావు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎవరు తప్పు చేశారనే విషయాన్ని సీబీఐ తేలుస్తుందని... విచారణ జరిగితే ఎవరు జైలుకు వెళ్తారో తెలుస్తుందని అన్నారు. ఉత్తరాంధ్రకు రాజధాని రాకూడదనేదే రామోజీరావు ధ్యేయమని చెప్పారు. విశాఖ భూముల కొనుగోళ్లలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఒక వ్యక్తి అంటున్నారంటూ పరోక్షంగా రఘురామకృష్ణరాజుపై మండిపడ్డారు. అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటో ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. అమరావతిలో జరిగిందాన్ని ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటారని చెప్పారు.