Rishab Shetty: 'కాంతార' చివరి 40 నిమిషాలు ఉగ్గబట్టుకుని చూశాను: అల్లు అరవింద్
- రిషబ్ శెట్టి హీరోగా రూపొందిన 'కాంతార'
- అడవి నేపథ్యంలో నడిచే కథ
- ఇదో డిఫరెంట్ మూవీ అని చెప్పిన అల్లు అరవింద్
- ఈ నెల 15వ తేదీన తెలుగులో విడుదల
ఇప్పుడు అందరూ కూడా 'కాంతార' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. కన్నడలో రూపొందిన ఈ సినిమా, ఇతర భాషా ప్రేక్షకులలోను విపరీతంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. హీరో రిషబ్ శెట్టినే ఈ కథను రాయడం .. దర్శకత్వం వహించడం విశేషం. అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.
తెలుగులో ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. అందులో భాగంగా నిర్వహించిన ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ .. " ఇన్ని సినిమాలు తీసిన నాకు .. 'కాంతార' చూసిన తరువాత, నేను నేర్చుకోవలసింది చాలా ఉందని అనిపించింది. ఒక డిఫరెంట్ సినిమాను చూడాలి అనుకునేవారు 'కాంతార'కు వెళ్లవచ్చు" అని చెప్పారు.
'పుష్ప' మాదిరిగానే ఈ సినిమా మొత్తాన్ని కూడా ఫారెస్టు నేపథ్యంలో తీశారు. ఫారెస్టు నేపథ్యమే కాకుండా విష్ణు తత్త్వాన్ని కూడా బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకుని చెప్పారు. ఈ తరహా సినిమాలు ఈ మధ్య కాలంలో హిట్ కావడం మనం చూశాము. రిషబ్ శెట్టి ఈ సినిమాలో ఎక్స్ లెంట్ గా చేశాడు. లాస్ట్ 40 నిమిషాలు నేను ఉగ్గబెట్టుకుని చూశాను. యాక్షన్ .. టెన్షన్ .. దైవత్వం అన్నీ కలిపి ఉన్న ఈ సినిమాను నేను ఎంజాయ్ చేశాను. మీరంతా కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.