Dilip Raja: ఆదిపురుష్ సినిమాపై రాజస్థాన్ మంత్రి వ్యాఖ్యలను ఖండించిన దర్శకుడు దిలీప్ రాజా
- ఆదిపురుష్ వంటి సినిమాల కోసం సనాతన సెన్సార్ బోర్డు ఏర్పాటు చేయాలన్న రాజస్థాన్ మంత్రి
- ఒక్కో సినిమాకు ఒక్కో బోర్డు ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్న
- సినిమాపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే ‘రివైజింగ్ కమిటీ’ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందన్న దిలీప్ రాజా
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమా చుట్టూ ముసురుకున్న వివాదాలకు తెరపడడం లేదు. ఆ సినిమా కొందరి మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, దానిని అడ్డుకుంటామంటూ కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. రాజస్థాన్ మంత్రి ఒకరు ఇటీవల మాట్లాడుతూ.. ఆదిపురుష్ వంటి సినిమాల కోసం ప్రత్యేకంగా సనాతన సెన్సార్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలను టాలీవుడ్ సినీ దర్శకుడు, కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు దిలీప్ రాజా ఖండించారు.
పెదరావూరులో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజస్థాన్ మంత్రి డిమాండ్ అభ్యంతరకరమని అన్నారు. ఒక్కో సినిమాకు ఇలా ఒక్కో సెన్సార్ బోర్డు ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించారు. ఆదిపురుష్ సినిమాపై కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరగడం, దానికి అక్కడి రాజకీయ నాయకులు వారికి మద్దతు తెలపడం సరికాదని అన్నారు. సినిమాను వాస్తవిక కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు. సినిమా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే వారు ‘రివైజింగ్ కమిటీ’ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. అయితే, కొన్ని మతాల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలు తీయడం కూడా సరికాదని అన్నారు. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారని దిలీప్ రాజా పేర్కొన్నారు.