Kerala: సోషల్ మీడియాలో మహిళలతో పరిచయం.. ఆపై కిడ్నాప్ చేసి నరబలి: కేరళలో భార్యాభర్తల దారుణం
- సిరిసంపదల కోసం మహిళలను బలిచ్చిన భార్యాభర్తలు
- వారికి జత కలిసిన మరో వ్యక్తి
- సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయం
- నిందితుల అరెస్ట్
ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా మూఢ నమ్మకాలు ఇంకా మనుషులను వేధిస్తూనే ఉన్నాయి. విజ్ఞానం శాస్త్రం ఎల్లలు లేకుండా అభివృద్ధి చెందుతున్నా మనుషుల మనసుల్లో గూడుకట్టుకుపోయిన మూఢవిశ్వాసాలను తొలగించలేకపోతున్నాయి. నిధుల కోసం నరబలులు ఇచ్చిన ఘటనలు గతంలో చాలానే వెలుగుచూశాయి. తాజాగా, కేరళలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఆర్థికంగా లాభపడతామని భావించిన భార్యాభర్తలు ఇద్దరు అమాయక మహిళలను బలిచ్చారు.
పోలీసుల కథనం ప్రకారం.. తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్-లైలా భార్యాభర్తలు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వీరు వాటి నుంచి బయటపడడంతోపాటు సిరిసంపదలు కలుగుతాయన్న ఉద్దేశంతో నరబలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరికి మహ్మద్ షఫీ అనే వ్యక్తి తోడయ్యాడు. అందరూ కలిసి నరబలికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కడవంతర, కాలడీలకు చెందిన ఇద్దరు మహిళలతో షఫీ సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేశాడు.
పథకంలో భాగంగా గత నెల 26న ఆ ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్ సింగ్ దంపతులతో కలిసి వారిని బలిచ్చాడు. మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. బాధిత మహిళలను లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవించే పద్మం (52), రోస్లీ (50)గా పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో వారు చెప్పిన విషయాలు విని విస్తుపోయారు. ఆర్థికంగా లాభపడేందుకే నరబలి ఇచ్చినట్టు చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.