G Jagadish Reddy: యాదాద్రి గుడికి వంద రూపాయలు ఇవ్వలేదు కానీ.. కోమటిరెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు: జగదీశ్ రెడ్డి
- రాజగోపాల్ రెడ్డి హామీలకు విలువ లేదన్న జగదీశ్ రెడ్డి
- పూటకొక అబద్ధం మాట్లాడటం వారికి అలవాటేనని ఎద్దేవా
- రాజకీయాల కోసం వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారని మండిపాటు
మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కోమటిరెడ్డి ఇచ్చే హామీలకు, సవాళ్లకు విలువ లేదని అన్నారు. పూటకొక అబద్ధం, నిమిషానికి ఒక అసత్యం మాట్లాడటం వారికి అలవాటేనని చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని రూ. 1,000 కోట్లతో కడితే ప్రధాని మోదీ రూ. 100 చందా కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డికి మాత్రం మోదీ రూ. 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని అన్నారు.
రాజగోపాల్ కు ఇచ్చిన రూ. 18,000 కోట్లను నల్గొండ, మునుగోడు అభివృద్ధికి ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం... రాజకీయాల కోసం మాత్రం వేల కోట్ల కాంట్రాక్టులను కట్టబెడుతోందని మండిపడ్డారు.