China: చైనా నుంచి తయారీ వసతుల తరలింపుపై ఐఎంఎఫ్ వార్నింగ్
- అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో చైనా కీలకమని వ్యాఖ్య
- చైనా పాత్రను తగ్గించే ప్రయత్నాలతో నష్టమని హెచ్చరిక
- జీరో కొవిడ్ పాలసీని చైనా వీడాలని సూచన
చైనా నుంచి తయారీని ఇతర దేశాలకు కంపెనీలు తరలిస్తుండడాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తప్పుబట్టింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో చైనా ముఖ్యమైన దేశమని గుర్తు చేసింది. ఇందుకు ఎన్నో సానుకూల కారణాలున్నట్టు తెలిపింది. చైనా సామర్థ్యం, ఉత్పాదకతను తగ్గించే ప్రయత్నాలు ఏవైనా, మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఐఎంఎఫ్ లో ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ గా ఉన్న కృష్ణ శ్రీనివాసన్ పేర్కొన్నారు.
చైనాలోని తమ తయారీ వసతులను అమెరికా, యూరప్ దేశాలు ఇతర దేశాలకు తరలిస్తుండడంపై ఎదురైన ప్రశ్నకు శ్రీనివాసన్ ఇలా స్పందించారు. ‘‘వృద్ధికి వాణిజ్యం అన్నది పెద్ద చోదకం కావచ్చు. కానీ కొంతమంది ప్రజలు వెనుకబడి ఉన్నారు. కనుక ప్రజలకు సంబంధించి విధానాల్లో.. ప్రతి ఒక్కరికీ విజయం అందేలా చేయడం ఎలా? అని ఆలోచించాలి’’అని సూచించారు. చైనా అనుసరిస్తున్న జీరో కొవిడ్-19 విధానం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించిందని శ్రీనివాసన్ చెప్పారు. ఈ విధానం నుంచి సురక్షితంగా బయటపడే మార్గాన్ని చైనా గుర్తించాల్సి ఉంటుందన్నారు. అప్పుడే చైనా ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగాన్ని సంతరించుకుంటుందన్నారు.
కరోనా వచ్చిన తర్వాత 2020 నుంచి చైనాలో కఠిన లాక్ డౌన్ లు అమలు చేస్తుండడం తెలిసిందే. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు చైనా చౌక ఉత్పత్తులను అందిస్తూ, తయారీ కేంద్రంగా ఉంది. లాక్ డౌన్ ల వల్ల అక్కడ తయారీ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చైనాను నమ్ముకున్న కంపెనీలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో చైనా నుంచి తయారీని భారత్ సహా ఇతర దేశాలకు తరలించే చర్యలు అమలు చేస్తున్నాయి. దీన్ని ఐఎంఎఫ్ తప్పుబట్టడం గమనార్హం.