apples: మధుమేహం ఉన్నవారు యాపిల్ తినొచ్చా..?

Should people with diabetes eat apples

  • నిశ్చితంగా తినొచ్చంటున్న వైద్యులు, అధ్యయనాలు
  • యాపిల్ లో ఉండేది ఫ్రక్టోజ్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు
  • ఇవన్నీ మధుమేహాన్ని నియంత్రించేవే

యాపిల్స్ తియ్యగా, చిరు పులుపుతో మంచి రుచిగా ఉంటాయి. యాపిల్ లో మంచి పోషకాలు కూడా ఉన్నాయి. మరి ఆరోగ్య రీత్యా మధుమేహులు యాపిల్ తినొచ్చా..? ఈ సందేహం చాలా మందికి ఎదురవుతుంటుంది. డయాబెటిస్ ఉన్నవారు యాపిల్ చక్కగా తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి. అవన్నీ యాపిల్ తినడం వల్ల మధుమేహులకు మేలు జరుగుతుందని తేల్చాయి. ఎందుకనో, యాపిల్ లో ఏమున్నాయో? తెలుకుకుందాం. 

పోషకాలు
ప్రపంచంలో యాపిల్ గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో రకాల పండ్లు ఉన్నా, పాప్యులర్ అయిన వాటిల్లో యాపిల్ కూడా ఒకటి. వీటిల్లో విటమిన్ సీ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక మీడియం సైజు యాపిల్ నుంచి 104 కేలరీలు లభిస్తాయి. 27 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 9 మిల్లీ గ్రాముల విటమిన్ సీ కూడా ఉంటాయి. యాపిల్ తొక్కలోనే పోషకాలు ఎక్కువ. కనుక మంచిగా శుభ్రం చేసుకుని తొక్కతో సహా యాపిల్ తినడమే ఆరోగ్యానికి మంచిది. యాపిల్ లో నీరు, ఫైబర్ కూడా ఎక్కువే.

తీసుకునే కార్బోహైడ్రేట్స్ పరిమాణం అన్నది మధుమేహం ఉన్న వారికి కీలకం అవుతుంది. మీడియం సైజు యాపిల్ లోని 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్ లో 4.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది . దీని వల్ల కార్బోహైడ్రేట్ల విడుదల నిదానంగా జరుగుతుంది. కనుక రక్తంలో గ్లూకోజ్ వేగంగా పెరిగిపోదు. యాపిల్ లో ఉండే ఫైబర్ మధుమేహులకు మేలు చేస్తుంది. క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, ఫ్లోరిజిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు యాపిల్ నుంచి లభిస్తాయి. ఇవన్నీ కూడా మధుమేహాన్ని నియంత్రించేందుకు సాయపడేవే. 

ప్రభావం స్వల్పమే..
యాపిల్ తిన్నప్పుడు మనకు తియ్యగా అనిపించేది ఫ్రక్టోజ్. పండులో భాగంగా ఫ్రక్టోజ్ తీసుకుంటున్నందున రక్తంలో గ్లూకోజ్ దీని కారణంగా పెరగదు. దీనికితోడు యాపిల్ లో ఫైబర్ ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతుంది. దాంతో గ్లూకోజ్ రక్తంలో నిదానంగా విడుదల అవుతుంది. ముఖ్యంగా యాపిల్ లోని పాలీఫెనాల్స్ (ప్లాంట్ కాంపౌండ్లు) నిదానంగా జీర్ణమయ్యేలా సాయపడతాయి. యాపిల్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ), గ్లైసిమిక్ లోడ్ (జీఎల్) తక్కువ. కనుక ఇలా చూసినా రక్తంలో గ్లూకోజ్ ఒకేసారి పెరిగిపోవడం ఉండదు. పైగా యాపిల్స్ ను రోజువారీ తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఇది కూడా రక్తంలో గ్లూకోజ్ తగ్గేందుకు సాయపడుతుంది. 

అధ్యయనాలు..
యాపిల్ తినడం వల్ల మధుమేహం రిస్క్ తగ్గుతున్నట్టు కొన్ని అధ్యయనాలు తేల్చాయి. 2019 నాటి ఒక సర్వే అయితే యాపిల్స్, పియర్స్ పండ్లను నిత్యం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ సమస్యల రిస్క్ తగ్గుతున్నట్టు గుర్తించింది. 2013 నాటి త్రీ కోహార్ట్ స్టడీస్ సైతం బ్లూబెర్రీ, గ్రేప్స్, యాపిల్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని ప్రకటించింది. కనుక యాపిల్ పై అపోహలు వీడి నిశ్చింతగా తినొచ్చు.

  • Loading...

More Telugu News