new covid varients: చైనాలో వెలుగు చూసిన మరింత ప్రమాదకర కరోనా వేరియంట్లు
- ఒమిక్రాన్ బీఎఫ్.7, బీఏ.5.1.7 వేరియంట్ల విస్తరణ
- వీటికి అత్యంత వేగంగా విస్తరించే గుణం
- శీతాకాలంలో కేసులు గణనీయంగా పెరగొచ్చన్న ఆందోళన
కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో.. అత్యంత వేగంగా విస్తరించే గుణమున్న మరో రెండు ప్రమాదకర కరోనా వేరియంట్లు వెలుగు చూశాయి. ఒమిక్రాన్ బీఎఫ్.7, బీఏ.5.1.7 అనే ఈ కొత్త రకాలకు అత్యంత వేగంగా విస్తరించే లక్షణాలున్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో రానున్న శీతాకాల సీజన్ లో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరగొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కొత్త వేరియంట్లతో చైనాలోని మరిన్ని ప్రాంతాలకు కరోనా కేసులు విస్తరించొచ్చని నిపుణులు భావిస్తున్నారు. బీఏ.5.1.7 కేసులను గ్వాంగ్ డాన్ ప్రావిన్స్ లోని షౌగన్ పట్టణంలో గుర్తించారు. బీఎఫ్.7 కేసులను షౌగన్ తో పాటు, యాంటాయ్ పట్టణంలో గుర్తించారు. ఈ రెండూ కరోనా వేరియంట్లు గత వేరియంట్ల తాలూకూ రోగనిరోధక వ్యవస్థ కళ్లు గప్పుతాయని చైనా ప్రభుత్వం అంటోంది.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం బీఎఫ్.7 మరింత ప్రభావవంతమైన కరోనా రకంగా అవతరించొచ్చని హెచ్చరించడం తెలిసిందే. బీఎఫ్.7 అన్నది బీఏ.5 వేరియంట్ ఉపరకమని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. అమెరికాలో ఈ వారంలోని కొత్త ఇన్ఫెక్షన్ కేసుల్లో 13 శాతం దీని కారణంగా వచ్చినవేనని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా ఏర్పడిన రోగ నిరోధక వ్యవస్థను కళ్లుగప్పే సామర్థ్యం ఉండడంతో బీఎఫ్.7 మరింత మందికి సోకవచ్చన్నది అంచనాగా ఉంది. దీంతో ఇప్పటికే తీసుకున్న కరోనా నిరోధక వ్యాక్సిన్ల ప్రభావంపై సందేహాలు నెలకొన్నాయి.