AP High Court: హైకోర్టు విచారణకు హాజరైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన లక్ష్మీనారాయణ
- బుధవారం నాటి విచారణకు స్వయంగా హాజరైన వైనం
- కేంద్రం రూ.5 వేల కోట్లు ఇస్తే విశాఖ ఉక్కు సమస్య తీరుతుందని వెల్లడి
- విచారణను 4 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇప్పటికే పలు దఫాలుగా విచారణ చేపట్టింది. తాజాగా బుధవారం కోర్టు చేపట్టిన విచారణకు లక్ష్మీనారాయణ స్వయంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆస్తుల విలువపై కేంద్రం విడుదల చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు.
విశాఖ ఉక్కు ఆస్తుల విలువ రూ.55 వేల కోట్లంటూ కేంద్రం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విశాఖ ఉక్కు ఆస్తుల విలువ రూ.60 వేల కోట్లకు పైగానే ఉంటుందని విచారణ సందర్భంగా లక్ష్మీనారాయణ హైకోర్టుకు తెలిపారు. అదే సమయంలో విశాఖ ఉక్కుకు కేంద్రం కేవలం రూ.5 వేల కోట్ల మేర సాయం చేస్తే.. సంస్థ కష్టాల నుంచి బయటపడుతుందని ఆయన తెలిపారు.
ఈ వాదనలు విన్న హైకోర్టు కేంద్ర ప్రభుత్వ స్పందన ఏమిటని ప్రశ్నించింది. కేంద్రం తరఫున విచారణకు హాజరైన న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.