Supreme Court: రద్దు చేసిన సెక్షన్ల ఆధారంగా కేసులు ఎలా పెడతారు?: సుప్రీంకోర్టు
- 2015లోనే ఐటీ యాక్టులోని 66ఏ సెక్షన్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు
- అయినా ఈ సెక్షన్ ఆధారంగా కేసులు నమోదు అవుతున్నాయంటూ యూపీసీఎల్ పిటిషన్
- సీజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని బెంచ్‌లో ఈ పిటిషన్‌పై విచారణ
- 66ఏ ప్రకారం ఇకపై కేసులు నమోదు చేయరాదన్న ధర్మాసనం
- విచారణ జరుగుతున్న కేసుల్లో నుంచి ఈ సెక్షన్‌ను తొలగించాలని ఆదేశం
చట్టంలో రద్దు చేసిన సెక్షన్ల ఆధారంగా కేసులు ఎలా నమోదు చేస్తారని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అంతేకాకుండా రద్దు చేసిన సెక్షన్ల ఆధారంగా కేసులు పెడుతున్న వైనంపై అన్ని రాష్ట్రాలకు సమాచారం చేరవేయాలని, రద్దు చేసిన సెక్షన్లపై ఇకపై ఎలాంటి కేసులు నమోదు కాకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కూడా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఐటీ యాక్టులోని సెక్షన్ 66ఏ ను 2015లోనే సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ సెక్షన్‌ను కొట్టివేసి ఏడేళ్లు అవుతున్నా... దేశంలోని చాలా ప్రాంతాల్లో పోలీసులు ఇదే సెక్షన్ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారని యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (యూపీసీఎల్) దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ అజయ్ రస్తోగీల నేతృత్వంలోని ధర్మాసనం యూపీసీఎల్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. శ్రేయా సింఘాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య నడిచిన వివాదంపై జరిగిన విచారణలో ఐటీ యాక్టులోని 66ఏ సెక్షన్‌ను సుప్రీంకోర్టే రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. అంతేకాకుండా ఇకపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం గానీ, ఈ సెక్షన్ కింద వ్యక్తులను విచారించడం గానీ చేయరాదని నాడే కోర్టు స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. ఇప్పటికైనా తీరు మారాలని, దేశంలో ఇకపై ఎక్కడ కూడా ఈ సెక్షన్‌పై కేసులు నమోదు కారాదని కోర్టు చెప్పింది. అంతేకాకుండా ఈ సెక్షన్ ఆధారంగా నమోదైన కేసులను తక్షణమే రద్దు చేయాలని, ఇతరత్రా సెక్షన్లతో ఈ సెక్షన్ కలిపి నమోదు చేసిన కేసుల్లో ఈ సెక్షన్‌ను తొలగించాలని కూడా కోర్టు సూచించింది.