Telangana: ఇక తెలంగాణలోనే ఫ్రీడం ఆయిల్ తయారీ... రూ.400 కోట్లతో రిఫైనరీ ఏర్పాటుకు జెమిని ఎడిబుల్స్ నిర్ణయం
- కేటీఆర్‌ను కలిసిన జెమిని ఎడిబుల్స్ ప్రతినిధి
- సింగపూర్ సంస్థతో కలిసి తెలంగాణలో రిఫైనరీ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదన
- జెమిని ఎడిబుల్స్ ప్రతిపాదనను స్వాగతించిన కేసీఆర్
- తెలంగాణ ఆయిల్ పామ్ రైతులకు మరింత మేలు జరుగుతుందని వ్యాఖ్య
వంట నూనెలలో అగ్రగామిగా ఉన్న ఫ్రీడం అయిల్ ఇకపై తెలుగు గడ్డపైనే తయారు కానుంది. ఈ మేరకు ఫ్రీడం అయిల్ తయారీ సంస్థ జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. జెమిని ఎడిబుల్స్ సంస్థ ప్రతినిధి బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తమ కంపెనీకి చెందిన రిఫైనరీని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు కేటీఆర్ ముందు ఆయన ఓ ప్రతిపాదన పెట్టారు.
ఈ ప్రతిపాదన ప్రకారం సింగపూర్‌కు చెందిన గోల్డెన్ అగ్రి ఇంటర్నేషనల్‌తో కలిసి సంయుక్తంగా రిఫైనరీని జెమిని ఎడిబుల్స్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఆ సంస్థ రూ.400 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ రీఫైనరీతో ఫ్రీడం అయిల్ ఇకపై తెలంగాణలోనే తయారు కానుంది. జెమిని ఎడిబుల్స్ ప్రతిపాదనను స్వాగతించిన కేటీఆర్... జెమిని ఎడిబుల్స్ రిఫైనరీతో రాష్ట్రంలో ఎల్లో రివల్యూషన్‌లో తెలంగాణ మరో కీలక అడుగు వేసినట్టు అవుతుందని తెలిపారు. జెమిని ఎడిబుల్స్ రిఫైనరీతో రాష్ట్రానికి చెందిన అయిల్ పామ్ రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు.