Andhra Pradesh: ఏపీ సీఎం జగన్‌తో అమెరికా కాన్సులేట్ జనరల్ భేటీ... కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నారని కితాబు
- ఇటీవలే హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన జెన్నిఫర్
- తాడేపల్లి వెళ్లి జగన్‌తో భేటీ అయిన వైనం
- జీడీపీలో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపారంటూ జగన్‌కు కితాబు
- ఏపీలో పెట్టుబడులకు సహకరించాలని జెన్నిఫర్‌కు జగన్ వినతి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లి వచ్చిన జెన్నిఫర్ సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నారంటూ జగన్‌ను జెన్నిఫర్ అభినందించారు. అంతేకాకుండా జీడీపీ వృద్ధిలో నెంబర్ వన్‌గా ఏపీని నిలబెట్టారని కూడా ఆమె జగన్‌కు కితాబిచ్చారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు సహకారం అందించాలని ఈ సందర్భంగా జెన్నిఫర్‌ను జగన్ కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అమెరికా రాయబార కార్యాలయం చీఫ్‌గా ఇటీవలే జెన్నిఫర్ నియమితులయ్యారు. తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశాలకు సంబంధించిన అమెరికా వ్యవహారాలను ఆమె పర్యవేక్షించనున్నారు. ఈ క్రమంలోనే ఆమె జగన్‌తో పరిచయం కోసం ఆయనతో భేటీ అయ్యారు.