Telangana: సమ్మె విరమించిన తెలంగాణ వీఆర్ఏలు!... రేపటి నుంచి విధుల్లోకి!
- 80 రోజులుగా నిరాహార దీక్షలు చేసిన వీఆర్ఏలు
- ఇటీవలే కేటీఆర్‌తో చర్చలు జరిపిన వీఆర్ఏల సంఘం
- తాజాగా సీఎస్‌తో వీఆర్ఏల చర్చలు సఫలం
తెలంగాణలో 80 రోజులుగా సమ్మె చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లు ఎట్టకేలకు సమ్మె విరమించారు. రేపటి నుంచి విధుల్లోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో వీఆర్ఏల సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. సమ్మె విరమణ దిశగా సీఎస్ చేసిన ప్రతిపాదనలకు వారు అంగీకరించారు. ఆ వెంటనే సమ్మె విరమిస్తున్నట్లు వీఆర్ఏలు ప్రకటించారు.
తమ సమస్యల పరిష్కారం కోసం 80 రోజుల క్రితం నిరాహార దీక్షలకు దిగిన వీఆర్ఏలు... తమ సమస్యలు పరిష్కారం అయితేనే సమ్మె విరమిస్తామని భీష్మించారు. ఈ క్రమంలో పలువురు వీఆర్ఏలు కూడా చనిపోయారు. అయినా కూడా వీఆర్ఏలు వెనక్కు తగ్గలేదు. ఇటీవలే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. నాడు వీఆర్ఏలు ప్రస్తావించిన ప్రధాన డిమాండ్లకు సూత్రప్రాయంగా కేటీఆర్ అంగీకారం తెలపగా...తాజాగా సీఎస్ ఆ డిమాండ్ల పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతోనే వీఆర్ఏలు సమ్మె విరమించారు.