Telangana: మునుగోడులో ఓటు లేని రాజగోపాల్ రెడ్డి జనాన్ని ఓటు ఎలా అడుగుతారు?: రేవంత్ రెడ్డి
- పాల్వాయి స్రవంతి తరఫున ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి
- రాజగోపాల్ రెడ్డి ఊరు మునుగోడులోనే లేదని ఆరోపణ
- 22 వేల ఓట్లతో గెలిచి రూ.22 వేల కోట్లకు అమ్ముడుబోయారని కోమటిరెడ్డిపై విమర్శ
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఆయా రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బుధవారం మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున ప్రచారం చేపట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు సంధించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి ఓటు హక్కే లేదన్న రేవంత్... అలాంటి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలను ఓటు ఎలా అడుగుతారని నిలదీశారు. అసలు రాజగోపాల్ రెడ్డి ఊరే మునుగోడులో లేదని కూడా రేవంత్ ఆరోపించారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మునుగోడులో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి 22 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని రేవంత్ గుర్తు చేశారు. నాలుగేళ్లు తిరక్కుండానే రూ.22 వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుబోయారని ఆరోపించారు. 2009కి ముందు రాజగోపాల్ రెడ్డి ఎవరో కూడా జనాలకు తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని బొడ్డులో కత్తులు పెట్టుకుని తిరిగిన నేతలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చామని ఆయన అన్నారు. మునుగోడును తానే దత్తత తీసుకుంటానన్న రేవంత్... సోనియా, రాహుల్ గాంధీలను మునుగోడుకు తీసుకువస్తానని చెప్పారు.