Anantapur: వరదలతో అనంతపురం అతలాకుతలం.. జలదిగ్బంధంలో 17 కాలనీలు
- మంగళవారం అర్ధరాత్రి కుమ్మేసిన వాన
- నడిమివంకకు పోటెత్తిన వరద నీరు
- ఇళ్లలోకి నీరు చేరడంతో సర్వం కోల్పోయిన బాధితులు
- నగర పరిధిలో ఐదు పునరావాస కేంద్రాలు
మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి అనంతపురం అతలాకుతలమైంది. కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని 12 కాలనీలు, రుద్రంపేట పంచాయతీలోని ఐదు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడిమివంకకు వరదనీరు పోటెత్తడంతో కాలనీల్లో ఐదడుగుల మేర నీరు చేరుకుంది. ఫలితంగా ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కష్టంగా మారింది. వరదనీరు ఇళ్లలోకి చేరుకోవడంతో బాధితులు సర్వం కోల్పోయారు.
తలదాచుకునేందుకు కూడా నిలువ నీడలేక ఇబ్బందులు పడుతున్నారు. అగ్నిమాపక దళాలు, పోలీసులు నిన్న తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతపురం పరిధిలో ఐదు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలోనూ ఇంతకుమించిన వానలు కురిసినా ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని బాధితులు చెబుతున్నారు.