BJP: నెహ్రూ తప్పిదాలకు దేశం ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
- భారత్ లో కశ్మీర్ విలీనం ఆలస్యం చేసింది నెహ్రూనే అని వ్యాఖ్య
- అప్పటి కశ్మీర్ మహారాజు ఒప్పుకోలేదని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్
- అది చారిత్రక అబద్ధం అని కిరణ్ రిజిజు కౌంటర్
స్వాతంత్ర్యం అనంతరం కశ్మీర్ ను భారత్ లో విలీనం చేసే విషయంలో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆలస్యం చేశారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేసే విషయంలో ఆలస్యం చేసింది మహారాజా హరిసింగ్ అని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు. నెహ్రూ చేసిన తప్పిదాలకు భారతదేశం ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని విమర్శించారు. స్వాతంత్య్ర కాలంలో హరిసింగ్ జమ్మూకశ్మీర్ మహారాజుగా ఉన్నారు. అయితే, కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ జైరామ్ రమేశ్ వరుస ట్వీట్లు చేయడంతో ట్విట్టర్‌లో దుమారం మొదలైంది.
‘కశ్మీర్ ను భారత్ లో విలీనం చేయడంపై మహారాజా హరిసింగ్ విలవిలలాడారు. కశ్మీర్ కు స్వాతంత్ర్యం (ప్రత్యేక దేశంగా) గురించి ఆయన కలలు కన్నారు. కానీ పాకిస్థాన్ దాడి చేశాక హరిసింగ్ భారతదేశంలో చేరేందుకు ఒప్పుకున్నారు. ఆ తర్వాత షేక్ అబ్దుల్లా పూర్తి విలీనాన్ని సమర్థించారు. జునాగఢ్ నవాబ్ పాకిస్థాన్ లో చేరిన సెప్టెంబరు 13, 1947 వరకు జమ్మూకశ్మీర్ పాకిస్థాన్ లో చేరడానికి సర్దార్ పటేల్ అంగీకరించారు’ అని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన రిజిజు.. ఇది చారిత్రక అబద్ధం అని అన్నారు. ‘స్వాతంత్య్రానికి నెల రోజుల ముందు జులై 1947లోనే తొలిసారిగా మహారాజా హరిసింగ్ నెహ్రూను సంప్రదించారు. కానీ, మహారాజు ప్రతిపాదనకు నెహ్రూ ఒప్పుకోలేదు. ఇతర సంస్థానాలను విలీనం చేసుకునేందుకు ఒప్పుకొని... హరిసింగ్ అభ్యర్థనను నెహ్రూ తిరస్కరించారు. 1947 అక్టోబర్‌లో కూడా నెహ్రూ ఈ అభ్యర్థనకు ఒప్పుకోలేదు. ఈ సమయంలోనే పాకిస్థానీ ఆక్రమణదారులు శ్రీనగర్‌కి కిలోమీటర్ల పరిధిలోకి చేరుకున్నారు. కశ్మీర్ కోసం నెహ్రూ కొన్ని 'ప్రత్యేక' కేసులను రూపొందించారు. భారత్ లో విలీనం కంటే 'చాలా ఎక్కువ' కోరుకున్నారు. ఆ ప్రత్యేక కేసు ఏమిటి? ఓటు బ్యాంకు రాజకీయాలే కదా?. నెహ్రూ చేసిన తప్పిదాలకు భారతదేశం ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోంది’ అని రిజిజు ట్వీట్ చేశారు.